Share News

Endowment Commissioner: భక్తితో రండి.. భద్రంగా వెళ్లండి

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:24 AM

ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో.. ఆలయాల్లో భక్తుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. భక్తులకు సులువుగా దర్శనం కల్పించడంతో పాటు వారి సౌకర్యార్థం ఆలయాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది.

Endowment Commissioner: భక్తితో రండి.. భద్రంగా వెళ్లండి

  • క్యూలైన్లలో క్రమశిక్షణగా వ్యవహరించాలి

  • తోటి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు

  • రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి

  • అవసరమైతే పోలీసు సాయం తీసుకోవాలి

  • ఆలయంలో సమాచార ప్రకటనలు తప్పనిసరి

  • భక్తుల భద్రత నిమిత్తం ప్రత్యేక మార్గదర్శకాలు

  • వరుస ఘటనల నేపథ్యంలో సర్కారు చర్యలు

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో.. ఆలయాల్లో భక్తుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. భక్తులకు సులువుగా దర్శనం కల్పించడంతో పాటు వారి సౌకర్యార్థం ఆలయాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ఆది, సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి వంటి పర్వదినాల్లో భక్తుల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈవోలను ఆదేశించింది. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ సర్క్యులర్‌ జారీచేశారు. కార్తీక మాసంలో ఆలయాల్లో పాటించాల్సిన నియమాలతో పాటు ముఖ్యమైన రోజుల్లో దేవాలయాల్లో భక్తులు, సిబ్బంది పాటించాల్సిన సూచనలను అందులో వివరించారు. దేవస్థానంలోని మైకుల ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారమిచ్చేలా ప్రకటనలు చేయాలని అందులో స్పష్టం చేశారు. కాశీబుగ్గ సంఘనట సహా ఈ ఏడాది జరిగిన పలు దుర్ఘటనల్లో కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భక్తులు కూడా దేవుడి పట్ల భక్తిభావంతో ఆలయానికి వచ్చి.. భద్రంగా తిరిగి వెళ్లాలని మార్గదర్శకాల్లో సూచించింది. ఈ మార్గదర్శకాలను వెంటనే అన్ని ఆలయాల్లోనూ అమలు చేసి, భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది.


అధికారులు, సిబ్బందికి సూచనలు..

  • ఆలయ ప్రాంగణంలో మైక్‌ ద్వారా నిరంతర ప్రకటనలు చేస్తూ భక్తులకు తగు సూచనలివ్వాలి.

  • ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

  • బారికేడ్లు, రైలింగ్‌లు పటిష్ఠంగా ఉన్నాయో లేదో ముందుగానే తనిఖీ చేయాలి.

  • ఆది, సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి రోజులు, ఇతర ముఖ్య పర్వదినాల్లో ఆయా దేవస్థానాల్లో తగిన సంఖ్యలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలి.

  • భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, వైద్యబృందాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

  • ఫస్ట్‌ ఎయిడ్‌, అంబులెన్సులు, కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి.

  • ఎక్కువ రద్దీ ఉన్న సమయాల్లో బందోబస్తు నిమిత్తం పోలీస్‌ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

  • పోలీస్‌ సిబ్బంది, గార్డులతో రోప్‌ పార్టీలను ఏర్పాటు చేసుకోవాలి


సోషల్‌ మీడియాను నియంత్రించాలి

దేవుడన్నా, ఆలయాలన్నా భక్తులకు కొంత సెంటిమెంట్‌ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు, ప్రత్యేకమైన దినాల్లో సోషల్‌ మీడియాలో కొంతమంది లేనిపోని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీంతో భక్తులు మరింత ఉత్సాహంగా ఆలయాలకు క్యూ కడుతున్నారు. ఊహించిన దానికంటే భక్తులు భారీ సంఖ్యలో వస్తుండడంతో ఆలయ సిబ్బంది కూడా చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే సోషల్‌ మీడియాలో అతిగా చూపించే వీడియోలను నియంత్రించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా సోషల్‌ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.


భక్తులు చేయాల్సినవి..

  • భక్తులు నిర్దేశించిన క్యూలైన్లలోనే దర్శనానికి వెళ్లాలి.

  • దర్శన సమయాలను గుర్తించి తదనుగుణంగా క్రమశిక్షణగా వ్యవహరించాలి.

  • దేవస్థాన సిబ్బంది సూచనలు పాటించాలి.

  • రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనం కోసం సహనంతో వేచి ఉండాలి.

  • వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ముందుగా దర్శనానికి వెళ్లేలా సహకరించాలి.

  • తోటిభక్తులకు ఇబ్బందికలిగేలా ప్రవర్తించరాదు

  • తొక్కిసలాట, పెద్దగా గుమిగూడిన పరిస్థితులు కనిపించిన వెంటనే దూరంగా వెళ్లాలి.

  • ఏదైనా అత్యవసర, అనుమానాస్పద పరిస్థితిని గమనిస్తే వెంటనే సిబ్బందికి తెలియజేయాలి.

  • దేవస్థానం ప్రాంగణంలో భక్తి, సహనం, క్రమశిక్షణతో మెలగవలెను.


భక్తులు చేయకూడనివి..

  • క్యూలైన్లలోకి వ్యతిరేకదిశలో ప్రవేశించకూడదు.

  • పరుగు తీయడం లేదా తోసుకోవడం చేయొద్దు

  • ముందున్న భక్తులను నెట్టకూడదు.

  • రైలింగ్‌లు, బారికేడ్లకు ఆనుకుని నిలవరాదు

  • గుంపులుగా చేరరాదు.

  • సిబ్బంది సూచనలను తప్పక పాటించాలి.

అధికారులు ఏం చేయాలి?

  • ఆలయాల్లో మైక్‌ ద్వారా ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు.

  • భక్తులకు స్పష్టంగా అర్థమయ్యేలా సూచనలిస్తూ ఉండాలి.

  • బారికేడ్లు, క్యూలైన్‌ మార్గాలను కిందస్థాయి సిబ్బంది అనధికారికంగా మార్చరాదు.

  • అత్యవసర, నిష్క్రమణ మార్గాలను అడ్డుకోరాదు.

  • ఏదైనా ఘటన జరిగిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి.

Updated Date - Nov 04 , 2025 | 07:36 AM