రూ.70 కోట్ల విలువైన ఆలయ భూములు కబ్జా!
ABN , Publish Date - May 28 , 2025 | 01:40 AM
రాజధాని ప్రాంతం రాయపూడిలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి దానం చేసిన రూ. 70 కోట్లు విలువ చేసే భూమి కబ్జాకు గురైంది. కబ్జాదారులు దర్జాగా ఈ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జా చేసిన భూమిలోని 20 సెంట్ల స్థలంలో కబ్జాదారులు చర్చి నిర్మాణానికి ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
-తుళ్లూరు మండలం, రాయపూడిలోని శ్రీవేణుగోపాల స్వామి దేవస్థానానికి 6.77 ఎకరాలు విరాళంగా ఇచ్చిన దాత
- దాతల మరణానంతరం భూములు స్వాధీనం చేసుకున్న మహిళ
- ల్యాండ్ పూలింగ్‌కు ఆ భూములు ఇచ్చి పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి లబ్ధి!
- 20 సెంట్లలో చర్చి నిర్మాణానికి ప్రయత్నం.. అడ్డుకున్న స్థానికులు
- దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవని విమర్శలు
రాజధాని ప్రాంతం రాయపూడిలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి దానం చేసిన రూ. 70 కోట్లు విలువ చేసే భూమి కబ్జాకు గురైంది. కబ్జాదారులు దర్జాగా ఈ భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జా చేసిన భూమిలోని 20 సెంట్ల స్థలంలో కబ్జాదారులు చర్చి నిర్మాణానికి ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయవాడ (ఇంద్రకీలాద్రి), మే 27 (ఆంధ్రజ్యోతి):
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన మల్లెల వెంకట రాయుడు దంపతులకు ఐదుగురు సంతానం. కుమారులు ఐదుగురికి ఆస్తులను సమానంగా పంచారు. అయితే రాయపూడి గ్రామంలోని సర్వే నెం.172/ఎలో 2.75 ఎకరాలు, 174/బిలో 2.50 ఎకరాలు, 132లో 1.52 ఎకరాలు వెరసి 6.77 ఎకరాల భూమిని గ్రామంలోని శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానానికి 1934లో విరాళంగా ఇచ్చారు. ఆ భూముల పత్రాలను మాత్రం ఆయన వద్దే ఉంచుకున్నట్టు సమాచారం. ఐదుగురు కుమారుల్లో నలుగురు వివాహాలు చేసుకోగా, ఒక కుమారుడు మల్లెల విశ్వనాథం వివాహం చేసుకోలేదు. అయితే ఆయన వయస్సు సుమారు 60 ఏళ్లు పైబడిన తర్వాత తన బాగోగులు చూసేందుకు ఓ మహిళను వివాహం చేసుకున్నట్టు స్ధానికులు చెబుతున్నారు. వెంకటరాయుడు చనిపోయిన తర్వాత విశ్వనాథం దేవస్థానానికి విరాళంగా ఇచ్చిన భూమి పత్రాలను ఆయన వద్ద పెట్టుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. విశ్వనాథం తనంతరం ఆయన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు వెంకటరాయుడు దేవస్థానానికి విరాళంగా ఇచ్చిన భూమి పత్రాలను కూడా ఆమె తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగి, రాజధాని నిర్మాణానికి భూములు అవసరం కావటంతో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు భూములను కొనుగోలు చేసి వారికి పరిహారం అందజేసి, కొన్ని ప్లాట్లు కేటాయించింది. ఈ క్రమంలో దేవస్థానం భూమి పత్రాలను విశ్వనాఽథం వివాహం చేసుకున్న మహిళ సంబంధిత అధికారులకు భూములను ఇచ్చి పరిహారంతో పాటు ప్లాట్లు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలువురు సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని దేవదాయశాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు రెండు సంవత్సరాల క్రితం ఈ భూమిని నిషేధిత రికార్డులో నమోదు చేయించారు. ఫిర్యాదుదారుల ఒత్తిడి మేరకు దేవదాయ శాఖ అధికారులు 43 రిజిస్టర్‌లో నమోదు చేశారు. అయితే భూమిని మాత్రం స్వాధీనం చేసుకోవటంలో కాలయాపన చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుదారులు రెవెన్యూ అధికారులను విశ్వనాథం భార్యకు ఇచ్చిన పరిహారాన్ని వెనక్కు తీసుకుని, కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి దేవస్థానానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆలయ భూమిలో చర్చి నిర్మాణానికి యత్నం
విశ్వనాథం భార్య పలువురు స్థానికులతో కలిసి సుమారు 20 సెంట్లు స్థలంలో చర్చి నిర్మించటానికి ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న ఫిర్యాదు దారులు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. దేవదాయ శాఖ, రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఫిర్యాదుదారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, దేవదాయ శాఖ స్పందించి కబ్జాకు గురైన శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే 6.77 ఎకరాల భూమిని దేవస్థానానికి అప్పగించటంతో పాటు రికార్డుల్లో దేవస్థానం పేరు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రికార్డుల్లో పేర్లు మార్చమని తహసీల్దార్‌కు లేఖలు
- వే ణుగోపాల స్వామి దేవస్థానం ఈవో అచ్చిరెడ్డి
రాయపూడిలోని శ్రీవేణుగోపాల స్వామి దేవస్థానానికి ఆరు ఎకరాల 77 సెంట్ల భూమిని దాత మల్లెల వెంకటరాయుడు విరాళంగా 1934లో ఇచ్చినట్లు గిఫ్ట్ డీడ్ ఉంది. అయితే ఆ రికార్డుల గురించి దేవదాయశాఖ అధికారులకు తెలియదు. గత ఏడాది జూలైలో దేవస్థానానికి విరాళంగా ఇచ్చిన భూమి ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. రికార్డులను పరిశీలిస్తే ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో భూమి ఉన్నట్లుగా తేలింది. దీంతో వారి పేర్లను తొలగించి దేవస్థానం పేరిట మ్యుటేషన్ చేయాలని స్థానిక తహసీల్దార్‌కు లేఖలు రాశాం. రెవెన్యూ వారు పట్టించుకోలేదు. సీఆర్‌డీఏ అధికారులు మాత్రం రికార్డులో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల పేరిట పూలింగ్ పరిహారంగా ప్లాట్లు, డబ్బులు ఇచ్చారు. సీఆర్‌డీఏ అధికారులకు ఈ అంశంపై దేవదాయశాఖ సహాయ కమిషనర్ లేఖరాశారు. ఇందుకు పరిహారంగా దేవదాయశాఖకు ఎకరాకు రూ.25 లక్షలు ఇస్తామని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు తాము అంగీకరించడం లేదు. పూలింగ్ నిబంధనల ప్రకారం ఎకరాకు వెయ్యి గజాల నివాస భూమి, కౌలు, 250 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్ ఇవ్వాలని కోరాం. రెవెన్యూ అధికారులు తక్షణం రికార్డుల్లో పేర్లు మార్చి దేవస్థానానికి అప్పగిస్తూ పాస్ బుక్‌లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.