Share News

సన్‌డే..

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:33 PM

జిల్లాలో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. ఎండలతో ప్రజలు విలవిలలాడారు.

సన్‌డే..
ముదినేపల్లిలో ఎండ తీవ్రతకు నిర్మానుష్యంగా జాతీయ రహదారి

ఉమ్మడి పశ్చిమలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

నేడు వేడిగాలుల హెచ్చరికలు

ఏలూరుసిటీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. ఎండలతో ప్రజలు విలవిలలాడారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమలోని జంగారెడ్డిగూడెం, పోలవరంలో అత్యధికంగా 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లాలోని ఏలూరు, చింతల పూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, కొవ్వూరు, నిడద వోలు, నరసాపురం ప్రాంతాల్లో 42 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 40 నుంచి 37 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇప్పటికే జిల్లాలో వారంరోజులుగా వేసవి వేడిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతల తీవ్రతతో పగటి పూట రహదారులపై ప్రయాణించడం కష్టతరంగా తయారైంది. ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.

వేడిగాలులపై హెచ్చరికలు

ఉమ్మడి పశ్చిమలో ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు మండలాలు, ఏలూరు జిల్లాలోని 16 మండలాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించినట్టుగానే ఆదివారం వేసవి వేడిగాలుల తీవ్రత కొనసాగింది.17న పశ్చిమగోదావరిలోని మూడు మండలాలు, ఏలూరు జిల్లాలోని 14 మండలాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి, భీమడోలు, బుట్టాయి గూడెం, ద్వారకా తిరుమల, ఏలూరు, గణపవరం, జంగా రెడ్డిగూడెం, కొయ్యల గూడెం, కుక్కునూరు, నిడమర్రు, పెదవేగి, పోలవరం, టి.నరసా పురం, ఉంగుటూరు, వేలేరుపాడు మండలాల్లోను, పశ్చిమగోదావరి జిల్లాలోని పెంటపాడు, తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - Mar 16 , 2025 | 11:33 PM