Share News

Telugu pride: అమరావతిలోతెలుగు అధ్యయన కేంద్రం

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:46 AM

భాష, జాతిపై అభిమానం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన స్మారకార్థం అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు....

Telugu pride: అమరావతిలోతెలుగు అధ్యయన కేంద్రం

ఎన్టీఆర్‌ అంటే ఉత్తేజం.. ఆవేశం.. రాజకీయ సంచలనం.. తెలుగు వైభవం. అందుకే ఆయన్ను తెలుగు ప్రజలంతా గుర్తుంచుకునేలా అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్‌ విగ్రహం పెడతాం. అక్కడే తెలుగు భాష అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తాం.

- సీఎం చంద్రబాబు

తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్‌ విగ్రహం.. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషి చేస్తాం

  • సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్‌

  • ‘సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘భాష, జాతిపై అభిమానం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన స్మారకార్థం అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మైసూర్‌లో ఉన్న తెలుగు అధ్యయన కేంద్రాన్ని తాత్కాలికంగా నెల్లూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ఏర్పాటు చేశారని, వెంకయ్యనాయుడు అనుమతిస్తే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని అన్నారు. 1984 ఆగస్టు సంక్షోభానికి అక్షరరూపం ఇస్తూ రూపొందించిన ‘సజీవ చరిత్ర-1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం’ పుస్తకావిష్కరణ కృష్ణా జిల్లా పోరంకిలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సరిగ్గా 41 ఏళ్ల కిందట జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే ప్రజాబలం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. దేశ రాజకీయాల్లో 1983 ఓ సంచలనమైతే 1984 ఆగస్టు సంక్షోభం... ప్రజాస్వామ్యంలో వర్తమానానికి.. భవిష్యత్తుకు ఓ సందేశంగా నిలిచిపోతుంది. అధికారంలోకి వచ్చిన నెలల్లోనే 1984 ఆగస్టులో నాటి కాంగ్రెస్‌ చేసిన కుట్రలతో ఎన్టీఆర్‌ పదవి కోల్పోవాల్సి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1984 వరకు 37 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ 26 ప్రభుత్వాలను పడగొడితే ఒక్కరూ తిరిగి గద్దెనెక్కిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్‌ ఒక్కరే ప్రజా పోరాటంతో మళ్లీ గద్దెనెక్కారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ వైపు ఉన్న 161 మంది ఎమ్మెల్యేలను రక్షించుకోవడం చాలాకీలకంగా మారింది. ఆనాడు కర్ణాటకలోని రామకృష్ణహెగ్డే ప్రభుత్వం అండగా నిలిచింది. నాడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచాయి. దీంతో 1984 సెప్టెంబరు 16న ఎన్టీఆర్‌ గద్దెనెక్కారు’ అని వివరించారు.

భారతరత్న వచ్చి తీరుతుంది

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడుతానని, అతి త్వరలోనే భారతరత్న రావడం ఖాయమని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘‘దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎన్టీఆర్‌. ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్‌. ఆయన ప్రారంభించిన ఎన్నో సంక్షేమ పథకాలను, సంస్కరణలను నేడు దేశమంతా అమలు చేస్తోంది. నాడు ఎన్టీఆర్‌ మహిళలకు స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్‌ పెడితే ఈరోజు మోదీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలన్నింటినీ నాడు ఎన్టీఆర్‌ ఏకతాటిపైకి తీసుకువచ్చారు’’ అని చంద్రబాబు అన్నారు.


ఆ ఉద్యమాన్ని పాఠ్యాంశంగా పెట్టాలి: వెంకయ్య

సజీవ చరిత్ర పుస్తకాన్ని ఈ తరం తప్పకుండా చదవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని పాఠ్యాంశంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని తాత్కాలికంగా నెల్లూరులో ఏర్పాటు చేశామని, దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తే.. తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కూడా పరిపాలనను తెలుగులోనే చేయాలని కోరారు.

ఏంచేయాలో చంద్రబాబుకు తెలుసు: త్రిపుర గవర్నర్‌

‘నాడు ఎన్టీఆర్‌ గాలిలో.. నాతోపాటు మరో ఇద్దరం బీజేపీ నుంచి గెలిచాం. 1984లో ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని సహించలేక ఆయనకు అండగా నిలిచాం. 1984 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు ఎంత ఓపిగ్గా ఉండేవారో చూశాను. సీఎం అయ్యాక తిరుమలలో నీటి ఎద్దడి నెలకొన్న సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎలా వ్యవహరించారో చూశాను’ అని త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా వ్యవహరించాలో చంద్రబాబు తెలిసినవిధంగా మరొకరికి తెలియదన్నారు. ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్ధన్‌ మాట్లాడుతూ.. భారతదేశ రాజకీయ చరిత్రలో ఓ ముఖ్యఘట్టానికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం గర్వంగా ఉందన్నారు. కమ్యూనిజం.. కేపిటలిజం.. సోషలిజం ఉంది కొత్తగా మీరేం చెబుతారని ఎన్టీఆర్‌ని ప్రశ్నిస్తే ‘నాది హ్యూమనిజం’ అని చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. అన్న ఎన్టీఆర్‌ యాప్‌ను చంద్రబాబు ఆవిష్కరించగా, సజీవ చరిత్ర పుస్తకం సాఫ్ట్‌ కాపీని ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించారు.

Updated Date - Sep 17 , 2025 | 04:50 AM