YS Sharmila: తెలుగు జాతికి చీకటి రోజు!
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:45 AM
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థి రాధాకృష్ణన్‌కు టీడీపీ, జనసేన, వైసీపీ ఓటేసిన మంగళవారం...
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆరెస్సెస్ వాదికి ఓటేస్తారా?
టీడీపీ, జనసేన, వైసీపీపై షర్మిల విమర్శలు
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థి రాధాకృష్ణన్‌కు టీడీపీ, జనసేన, వైసీపీ ఓటేసిన మంగళవారం తెలుగుజాతికి చీకటి రోజు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆత్మగౌరవమే అజెండా అని తెలుగుదేశం, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన ప్రకటించాయని గుర్తుచేశారు. తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ తెలుగు జాతికి తీరని ద్రోహం చేసిందని మంగళవారం ‘ఎక్స్’ పోస్టులో విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీపడితే.. ఆరెస్సెస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులని అన్నారు. ఇది జాతీయస్థాయిలో తెలుగుజాతికి జరిగిన ఘోర అవమానమని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం కనిపించలేదా అని ప్రశ్నించారు. మరోవైపు ఈడీ, సీబీఐ కేసులకు భయపడి బీజేపీ బలపరచిన అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఓటేసి.. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని ఏఐసీసీ కార్యదర్శి మాణిక్కం ఠాకూర్ ఆరోపించారు.