U S Agriculture: అమెరికాలోసాగు భళా!
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:17 AM
అమెరికా వెళ్లినా.. అంతరిక్షంలోకి వెళ్లినా ప్రవాసాంధ్రులు మాత్రం మట్టితో చుట్టరికాన్ని మర్చిపోరు. పాడి పంటలపై ప్రేమాభిమానాలను అంత తేలిగ్గా వదులుకోరు.....
వ్యవసాయంలో ప్రవాసాంధ్రుల జోష్.. పంట భూముల కొనుగోళ్లలో దూకుడు
పప్పులు, కూరగాయలు, పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాల పంట
భవిష్యత్తులో రియల్ బూమ్‌పైనా ఆశలు
రాంచ్ యజమానులకు పన్ను రాయితీ
వందలాది ఎకరాల్లో గోశాలల నిర్వహణ
(డాలస్ నుంచి కిలారు గోకుల్ కృష్ణ)
అమెరికా వెళ్లినా.. అంతరిక్షంలోకి వెళ్లినా ప్రవాసాంధ్రులు మాత్రం మట్టితో చుట్టరికాన్ని మర్చిపోరు. పాడి పంటలపై ప్రేమాభిమానాలను అంత తేలిగ్గా వదులుకోరు. ఏళ్ల క్రితం అగ్రరాజ్యానికి వలస పోయినవారు ఇప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రకరకాల పండ్లు, కూరగాయలు పండిస్తూ ‘ఔరా’ అనిపిస్తున్నారు. మరోవైపు పాడి రంగంలోనూ ముద్ర వేస్తున్నారు. ఐటీ, వైద్యం, వ్యాపార రంగాల్లో స్థిరపడిన తర్వాత దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అమెరికా వ్యవసాయ రంగంలో తెలుగు ప్రవాసుల పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కొవిడ్ అనంతరం ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ ధరకు పెద్దమొత్తంలో వ్యవసాయ భూములు సొంతం చేసుకొనే అవకాశం ఉండటం కూడా వారికి కలిసి వస్తోంది. రియల్ ఎస్టేట్ బూమ్‌తో సమీప భవిష్యత్తులో భూమి విలువ పెరుగుతుందనే అంచనాలతో వందలాది ఎకరాలు సేకరిస్తున్నారు. కొందరు పూర్తిస్థాయి రైతులుగా మారుతుంటే.. మరికొందరు దీన్ని ఒక అదనపు ఆదాయ వనరుగా భావిస్తున్నారు.
శిస్తు అంతంతే...
అమెరికాలో సాగు భూములకు పన్ను చాలా తక్కువ. వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన కార్యకాలపాలు సాగించే భూములకే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో భూములు కొనుగోలు చేసినవారు వారాంతాల్లో పొలానికి వెళ్లడం, పంటల పెరుగుదలను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు పశువుల పెంపకం ద్వారా గ్రామీణ జీవనాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు పన్ను ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. భూములు ఉన్న ప్రాంతంలో నివాసం ఉండని యజమానులు స్థానిక రైతులకు పొలం లీజుకు ఇస్తున్నారు. లేకుంటే తామే కూలీలను నియమించుకుని సొంతంగా సాగు చేసుకుంటున్నారు. వ్యవసాయ భూముల్లో తెలుగువారి పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాలకు కొత్త మూలధనాన్ని, ఆధునిక పద్ధతులను, భిన్నమైన పంటలను పరిచయం చేస్తోంది.
ఏజీ5 వర్గీకరణపై మక్కువ
అమెరికాలో వ్యవసాయ వర్గీకరణ పొందాలంటే భూమి కనీసం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి. భూమిని చిన్న భాగాలుగా విభజించి అమ్మాలంటే కూడా, ప్రతి భాగం కనీసం ఐదెకరాలు ఉండాలి. దీనితోపాటు ఆ భూమిలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు కచ్చితంగా నిర్వహించాలి. ఏజీ5 భూములకు ప్రాథమిక మౌలిక వసతులు ఉండాలి. రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఈ వర్గీకరణలో అమ్మే భూములు మరింత భద్రతతో ఉండటంతో పాటు, వాటి ధర కూడా ఎక్కువే. ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ప్రవాసులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో కొందరు వ్యవసాయం పట్ల నిజమైన ప్రేమతో పూర్తిస్థాయి రైతులుగా స్థిరపడుతున్నారు. పంటల సాగు, పశువుల పెంపకంపై ఆసక్తితో, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ వ్యవసాయాన్ని జీవన విధానంగా స్వీకరిస్తున్నారు.

250 ఎకరాల్లో పండ్ల సాగు
కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన గొర్రెపాటి చందు, రాజమహేంద్రవరానికి చెందిన సుధీర్ దుగ్గిరాల అమెరికాలో స్థిరపడ్డారు. వీరు ఫ్లోరిడాలోని ఒకిచోబీలో 2023లో ఎకరంరూ.8 లక్షలు చొప్పున 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న వందేళ్ల కిందటి డైరీఫాంను కొనుగోలు చేశారు. సిరి ఫామ్స్ పేరిట అందులో 250 ఎకరాల్లో గంగిరేగు పండ్లు, సీతాఫలం, ఏడు రకాల మామిడి, కొబ్బరి, జామ, రామాఫలం, నేరేడు, వేప, రావి, చింత, ఉసిరి, పనస, ఖర్జూరం సాగు చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో వేపనూనె పిచికారీ చేస్తూ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. పంట ఉత్పత్తులను వాట్సాప్ ఆర్డర్ల ద్వారా అమెరికా వ్యాప్తంగా రెండు రోజుల్లో సరఫరా చేస్తున్నామని, త్వరలో తమ పొలం వద్దనే ఒక దుకాణం తెరిచే ఆలోచనలో ఉందని వీరు చెబుతున్నారు. వైవిధ్యం, విస్తీర్ణం పరంగా ఫ్లోరిడాలో అతిపెద్ద సాగుభూముల్లో ఒకటిగా సిరి ఫామ్స్ పేరు పొందింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం రూ.28 లక్షలు పలుకుతోంది.

600 ఎకరాలు.. 3 వేల గోవులు!
తెలంగాణకు చెందిన కొందరు ప్రవాస తెలుగు రైతులు కలిసి న్యూమెక్సికో సమీపంలో 600 ఎకరాల్లో 3వేల జెర్సీ ఆవులతో భారీ గోశాల నిర్వహిస్తున్నారు. 40 మంది కూలీలను నియమించుకుని ఈ గోవుల నుంచి రోజుకి రెండుసార్లు చొప్పున మొత్తంగా 66 వేల లీటర్ల పాలను సేకరించి, విక్రయిస్తున్నారు. ట్రంప్ టారి్‌ఫల కారణంగా లీటరు రూ.18 (20 సెంట్లు)కు అమ్ముతున్నారు. డీ-80 వ్యవస్థతో 160 గోవుల నుంచి15నిమిషాల్లో పాలు సేకరించి ఉష్ణోగ్రత నియంత్రిత ట్యాంకర్లోకి ఎక్కించి రవాణా చేస్తున్నారు. 600 ఎకరాల్లో సగం గోశాలకు, ఇతర నిర్మాణాలకు పోగా మిగిలిన 300 ఎకరాల్లో దాణా గడ్డి సాగుచేస్తూ నీటి కోసం బావులు తవ్వారు. ఈ గడ్డి 2 నెలలకు సరిపోతుందని, మిగతా దాణాను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ గోశాలలో పాడిసంపదను 12 వేలకు, విస్తీర్ణాన్ని వేల ఎకరాలకు పెంచడమే లక్ష్యమని చెబుతున్నారు.

పిస్తా పంటతో భారీ రాబడి
విజయవాడకు చెందిన దేశు గంగాధర్‌కు కృష్ణాజిల్లా గండేపల్లిలో అల్లం, చెరుకు సాగు చేసిన అనుభవం ఉంది. దీంతో ఆరిజోనాలోని బోవైలో 160 ఎకరాల్లో 2016 నుంచి పిస్తా పప్పు పండిస్తున్నారు. 8 నుంచి 12 ఏళ్ల మధ్య పిస్తా చెట్టు కాపుకు వస్తుంది. 8వ ఏట నుండి దిగుబడి రెండింతలు అవుతుంది. 13వ ఏట పతాక స్థాయిలో దిగుబడి వస్తుందని గంగాధర్ తెలిపారు. ఎకరానికి రూ.2.5 లక్షల పెట్టుబడికి 1,800 కిలోల పప్పు దిగుబడి ద్వారా రూ.6.5 లక్షల రాబడి ఉంటుందని చెప్పారు. నీటి సమస్య, చీడపీడలు, చలి వంటి సవాళ్లు అమెరికాలోనూ ఉంటాయని వివరించారు. బాదం, పిస్తా సాగులో అమెరికా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. టాప్ గ్రేడ్ పప్పును ఇజ్రాయెల్ కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత రకాలను మధ్యప్రాచ్య, యూరప్, చైనా దేశాలు కొనుగోలు చేస్తాయి.
రాంచ్‌ల్లో విస్తృతంగా పశువుల పెంపకం
భూమి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాల్‌సకు చెందిన రియల్ ఎస్టేట్ నిపుణుడు అనంత్ మల్లవరపు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో డాలస్ చుట్టుపక్కల తెలుగువారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక రాంచ్‌ల వార్షిక నిర్వహణ ఖర్చులు, ఆస్తి పన్నులను భర్తీ చేసుకోవడానికి ఆయా భూముల్లో ఈవెంట్ సెంటర్లు, ఎయిర్ బీఎన్‌బీ క్యాబిన్లు నిర్మించి అద్దెకు ఇస్తున్నారని తెలిపారు. పన్ను మినహాయింపుల కోసం... రాంచ్‌ల్లో వ్యవసాయం తక్కువగా, పశువుల పెంపకం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. భూమిని కేవలం పెట్టుబడిగా చూస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేయకపోవడం వలన కొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలు కోల్పోయి, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని అనంత్ వివరించారు.