Share News

BC Reservations: చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:37 AM

చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు...

BC Reservations: చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

  • వాటిని సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఓబీసీ జాతీయ సదస్సులో తెలుగు ఎంపీల డిమాండ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): చట్టసభలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బుధవారం, ఆంధ్ర/తెలంగాణ భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అధ్వర్యంలో బీసీల హక్కులపై ఓబీసీ జాతీయస్థాయి సెమినార్‌ను నిర్వహించారు. ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బి.నాగరాజు, వి.రవిచంద్ర, బీద మస్తాన్‌రావు, పి.సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని అన్నారు. బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు. సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను బీసీలకు జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో బీసీలకు ప్రత్యేకంగా రెండు నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లాగా బీసీలకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కోరారు.

Updated Date - Dec 11 , 2025 | 03:37 AM