Mountaineer Bharat: తెలుగు తేజం అరుదైన ఘనత
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:55 AM
కర్నూలుకు చెందిన పర్వతారోహకుడు 36 ఏళ్ల తమ్మినేని భరత్ అరుదైన ఘనతను సాధించాడు.
ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాల్లో తొమ్మిది అధిరోహించిన తొలి భారతీయుడుగా కర్నూలు వాసి తమ్మినేని భరత్ రికార్డు
దశాబ్ద కాలంగా ఆరు ఖండాల్లోని పర్వతారోహకులకు మార్గదర్శకుడు
ప్రపంచంలోనే తొలిసారిగా ఎవరెస్ట్ అధిరోహించిన అంధ మహిళ విజయం వెనుకా మనోడే
కర్నూలు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కర్నూలుకు చెందిన పర్వతారోహకుడు 36 ఏళ్ల తమ్మినేని భరత్ అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచలోని 14 ఎత్తైన పర్వత శిఖరాల్లో తొమ్మిందింటిని విజయవంతంగా అధిరోహించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. మౌంట్ చో ఓయూ... చైనాలో ఉన్న ఈ పర్వత శిఖరం ప్రంపంచంలో ఎత్తైన వాటిలో ఆరవది. ఇది సముద్ర మట్టానికి 8,188 మీటర్ల ఎత్తులో ఉంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం 8.55 గంటలకు తెలుగు తేజం... భరత్ ఆ శిఖరాన్ని అధిరోహించాడు. దీంతో ఆయన తొమ్మిది శిఖరాగ్రాలను అధిరోహించినట్లయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ తాజా విజయానికి ముందు... తమ్మినేని 2017, మేలో ఎవరెస్ట్, సెప్టెంబరు 2018లో మౌంట్ మనస్లు, 2019 మేలో మౌంట్ లోట్సే, మార్చి 2022లో మౌంట్ అన్నపూర్ణ, అదే ఏడాది ఏప్రిల్‌లో మౌంట్ కాంచనగంగ, మే 2023లో మౌంట్ మకాలు, అక్టోబరు 2024లో మౌంట్ శిశాపంగ్మ, 2025 ఏప్రిల్‌లో మౌంట్ ధౌలగిరిలను అధిరోహించారు. ఇవన్నీ సముద్రమట్టానికి 8,000 మీటర్లను మించి ఉన్న శిఖరాలే. మిగిలిన ఐదు శిఖరాగ్రాలు... మౌంట్ కే2, నంగా పర్బాత్, గషెర్‌బ్రమ్ 1, 2, బ్రాడ్ పీక్... పాకిస్తాన్‌లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి భారతీయ పర్వతారోహకులకు అందుబాటులో లేవు.
ఎందరికో స్ఫూర్తినిస్తూ...
తమ్మినేని మిత్రుడు, అతని పర్వతారోహణ ప్రయాణాన్ని సునిశితంగా గమనిస్తూ వచ్చిన దీపాంజన్ దాస్ మాట్లాడుతూ, ‘గత దశాబ్ద కాలంగా ఆరు ఖండాల్లోని పర్వతారోహక బృందాలకు భరత్ మార్గదర్శకుడిగా, కొత్త తరం భారతీయ పర్వతారోహకులకు స్ఫూర్తిగా నిలిచాడు. అతని నేతృత్వంలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అంధ మహిళ చోన్జిన్ అంగ్మో 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోనే ఇది సాధించిన మొదటి అంధ మహిళగా ఆమె నిలిచారు. అలాగే 16 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో ఏడు శిఖరాలను అధిరోహించిన యువకుడిగా విశ్వనాథ్ కార్తికేయ రికార్డు సాధన వెనుక భరత్ ఉన్నారు’ అని తెలిపారు.
ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు: భరత్
బేస్ క్యాంపునకు వచ్చిన తరువాత భరత్ మాట్లాడుతూ, ‘మౌంట్ చో ఓయూని అధిరోహించడానికి సెప్టెంబరు 30న బేస్ క్యాంపునకు చేరుకున్నాం. అయితే అత్యంత ప్రతికూల వాతావరణం ఉండడంతో మేం ముందుకు కదలలేకపోయాం. అక్టోబరు 12న శిఖరాగ్రానికి వీలైనంత వేగంగా కదలాలని నిర్ణయించుకున్నాం. చైనా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6.55 గంటలకు శిఖరాగ్రానికి చేరుకున్నా’ అని తెలిపారు. బేస్ క్యాంపు నుంచి తన సందేశాన్ని రికార్డు చేసి భరత్ పంపారు. ‘ఇది కేవలం వ్యక్తిగత విజయం కాదు. భారతీయ సాహస క్రీడల సామర్థ్యానికి ఇది ప్రతీక. ఈ విజయాన్ని దేశంలోని కొత్త తరం సాహసక్రీడల ఔత్సాహికులకు అంకితమిస్తున్నా. పర్వతాలు గౌరవాన్ని, పట్టుదలను, సహనాన్ని కోరుతున్నాయి. ఈ రోజు చో ఓయూ శిఖరాగ్రంపై నిలబడ్డ నేను నా ప్రయాణంపట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను. ఇది అత్యంత ఎత్తైన శిఖరాలను లక్ష్యం చేసుకోవలన్న స్ఫూర్తిని దేశంలోని కొత్తతరం పర్వతారోహకుల్లో నింపుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
భరత్ ఘనత దేశానికే గర్వకారణం
తల్లి సుశీల, అక్కల భావోద్వేగం
భరత్ సాధించిన ఘనత దేశానికే గర్వకారణమని తల్లి సుశీల, అక్కలు రాజీ, బిందు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ భరత్ సాధించిన విజయంపట్ల ఆనందోద్వేగాలతో స్పందించారు. కర్నూలు నగరం వెంకటరమణ కాలనీలో ఉండే వ్యాపారి నాగరాజు, సుశీల దంపతులకు ముగ్గురు పిల్లలు. కర్నూలలో ప్రాథమిక విద్యను చదివిన భరత్ 6-10వ తరగతి వరకు గుంటూరులో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదివాడు. ఇంటర్ కర్నూలులో పూర్తి చేశాడు. ఊటీలో బీటెక్ జెనిటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తండ్రి నాగరాజు మరణం తరువాత 2016లో కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో 2012 నుంచి పర్వతారోహణలో శిక్షణ తీసుకుంటున్నాడు. అమ్మ సుశీల, అక్కల ప్రోత్సాహంతో అవిశ్రాంతంగా ముందుకు సాగుతున్నాడు భరత్ తమ్మినేని.