Share News

PM ABHIM Scheme: కొత్తగా 31 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లు

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:34 AM

ప్రజలకు అధునాతన సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 31 క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల (సీసీబీలు)ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది.

PM ABHIM Scheme: కొత్తగా 31 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లు

  • అధునాతన వైద్య సేవలకు 29చోట్ల 50, రెండు చోట్ల వంద పడకలతో ఏర్పాటు

  • రూ.769.75 కోట్ల వ్యయం.. డిసెంబరు

  • నాటికి 80 శాతం సీసీబీల్లో సేవలు

  • ఐసీయూ, డయాలసిస్‌, ఎమర్జెన్సీ బెడ్స్‌,

  • లైఫ్‌ సేవింగ్‌ సపోర్ట్‌, బ్లడ్‌ బ్యాంక్‌,

  • డయాగ్నస్టిక్‌ లేబొరేటరీ సదుపాయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అధునాతన సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 31 క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల (సీసీబీలు)ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ‘పీఎం అభిమ్‌’ కింద ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాల్లో 29 చోట్ల 50 పడకలు, మరో రెండు చోట్ల వంద పడకలు ఉంటాయి. 50 పడకల కేంద్రాలకు ఒక్కోదానికి రూ.23.75 కోట్ల చొప్పున, వంద పడకల కేంద్రాలకు ఒక్కోదానికి రూ.40.5 కోట్ల చొప్పున రూ.769.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. వంద పడకల కేంద్రాలను ఒక్కోదాన్ని హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రి, రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, వివిధ జిల్లాల్లో ఏర్పాటయ్యే 50 పడకల కేంద్రాలను ఒక్కోదాన్ని 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వంద పడకల కేంద్రాలు వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం పూర్తయి.. సేవలు ప్రారంభిస్తాయని చెప్పారు. కేంద్రం దేశవ్యాప్తంగా పీఎమ్‌-అభిమ్‌ (ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత వైద్య మౌలిక సదుపాయాల పథకం) కింద ఐదు లక్షల జనాభా దాటిన ప్రతి జిల్లాలో సీసీబీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2021-22 నుంచి 2025-26 మధ్య వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ వ్యయంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. సీసీబీలను జిలా ఆస్పత్రులతో పాటు బోధనాస్పత్రుల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. నిజామాబాద్‌, నల్గొండ కేంద్రాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మరో ఏడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 8 కేంద్రాలు ఈ నెలఖారుకు, ఇంకో 8 డిసెంబరులో అందుబాటులోకి రానున్నాయి. మిగిలినవి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. జాతీయ రహదారుల వెంబడి ఏర్పాటు చేస్తున్న ట్రామా కేర్‌ సెంటర్లకు అదనంగా సీసీబీలను నెలకొల్పుతున్నారు.


ఏ వైద్య సేవలు అందుతాయంటే...

సీసీబీల్లో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ), ఐసోలేషన్‌ వార్డు, డయాలసిస్‌ యూనిట్‌, ఎమర్జెన్సీ బెడ్స్‌, మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, లైఫ్‌ సేవింగ్‌ సపోర్ట్‌, బ్లడ్‌ బ్యాంక్‌, డయాగ్నస్టిక్‌ లేబొరేటరీ ఉంటాయి. ఆర్థోపెడిక్స్‌, న్యూరో సర్జన్‌, ప్లాస్టిక్‌ సర్జన్‌, జనరల్‌ సర్జరీ, జనరల్‌ ఫిజీషియన్‌, మత్తుమందు వైద్యుడు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు. సీసీబీల్లో అత్యవసర కేసుల్లో శస్త్రచికిత్సలు సహా వైద్య సేవలందిస్తారని వైద్య శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - Sep 07 , 2025 | 06:35 AM