Maoist Party: మరో ఆర్నెల్ల పాటు కాల్పుల విరమణ
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:16 AM
తాము మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తున్నామని తెలంగాణ మావోయిస్టు పార్టీ సోమవారం ఓ లేఖ విడుదల చేసింది.
శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తాం
తెలంగాణ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల
చర్ల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : తాము మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తున్నామని తెలంగాణ మావోయిస్టు పార్టీ సోమవారం ఓ లేఖ విడుదల చేసింది. పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన ఆ లేఖలో కాల్పుల విరమణపై పలు అంశాలను ప్రస్తావించారు. గత ఏప్రిల్, మే నెల్లో తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు శాంతి యుత వాతావరణం కావాలని ఉద్యమాలు చేశాయని, దాని అనుగుణంగా తమ పార్టీ ఆరు నెలల పాటు కాల్పులు విరమణ ప్రకటించిందని పేర్కొన్నారు. ఇదే వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని తెలిపారు. గతంలో కొనసాగిన విధంగానే తమవైపు నుంచి శాంతియుత వాతావరణం కొనసాగిస్తామని, ప్రభుత్వం కూడా గతంలో వ్యవహరించిన విధంగా ఉండాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతున్న శాంతి యుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు, సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు పోరాడాలని జగన్ ఆ లేఖలో పిలుపునిచ్చారు.