Guntur: జ్యోతిషం పేరుతో రూ.లక్ష స్వాహా
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:54 AM
జ్యోతిషం పేరుతో ఓ ఘరానా మోసగాడు రూ.లక్ష స్వాహా చేశాడు. ‘జ్యోతిషం చెప్పబడును’ అంటూ టీవీలో వచ్చిన స్ర్కోలింగ్‌ను చూసిన బాధితుడు

మోసంపై పోలీసులకు ఫిర్యాదు.. నిందితుడు అరెస్టు.. రూ.లక్ష రికవరీ
మద్దూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జ్యోతిషం పేరుతో ఓ ఘరానా మోసగాడు రూ.లక్ష స్వాహా చేశాడు. ‘జ్యోతిషం చెప్పబడును’ అంటూ టీవీలో వచ్చిన స్ర్కోలింగ్‌ను చూసిన బాధితుడు ఆ వలలో చిక్కుకున్న ఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కమలాయపల్లిలో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మోసగించిన డబ్బును తిరిగి ఇప్పించారు. కేసు వివరాలను సీఐ శ్రీను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. కమలాయపల్లికి చెందిన నారాయణచారి కొద్ది రోజులుగా ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో జనవరిలో ఓ టీవీ చానల్‌లో జ్యోతిషం చెప్పబడును అంటూ వచ్చిన స్ర్కోలింగ్‌ను చూసి అక్కడ ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. జ్యోతిషం చెప్పించుకుంటే.. బాధలు తొలగిపోయి, మంచి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పెద్దపలకనూరు చెందిన దక్షిణపు శివయ్య అనే వ్యక్తి నమ్మబలికాడు. దీంతో శివయ్య చెప్పిన విధంగా నారాయణచారి మొదట ఆయన బ్యాంకు ఖాతాకు రూ.50 వేలు పంపాడు.
వారం తర్వాత శివయ్య ఫోన్ చేసి పూజకు డబ్బులు సరిపోలేదని, సగంలో ఆగిపోయిందని నమ్మించడంతో.. నారాయణచారి మరో రూ.50 వేలు పంపించాడు. మళ్లీ వారం తర్వాత ఫోన్ చేసి ఇంకా డబ్బు కావాలని, పూజ పూర్తవ్వలేదని, పూజ పూర్తి కాకుంటే చెడు జరుగుతుందని చెప్పడంతో నారాయణచారికి అనుమానం వచ్చింది. తాను మోసానికి గురైనట్లు భావించిన బాధితుడు 1930 నంబరుకు ఫోన్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్టు చేశాడు. కేసు నమోదు చేసి, సాంకేతికత సాయంతో నిందితుడు శివయ్యను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. జాతకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని చెప్పారు. అతని సెల్‌ఫోన్ సీజ్ చేసి, బాధితుడికి రూ.లక్ష తిరిగి ఇప్పించామని తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.