Share News

దసరాకు ‘టెక్‌’ బందోబస్తు

ABN , Publish Date - Aug 03 , 2025 | 01:30 AM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బందోబస్తును ఈసారి సాంకేతిక మార్గంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గడచిన ఏడాది ఎదురైన అనుభవాలు, జరిగిన తప్పొప్పులను బేరీజు వేసుకుని పోలీసుపరంగా టెక్నాలజీ ఉపయోగించి బందోబస్తును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగంలో ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం డీజీపీ స్వయంగా ప్రకటించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో సుమారుగా 7వేల సీసీ కెమెరాలు ఉన్నాయి. శరన్నవరాత్రుల బందోబస్తుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దసరాకు ‘టెక్‌’ బందోబస్తు

అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు

మహామండపంలో శాశ్వతంగా ‘కమాండ్‌’

సొంతంగా ఏర్పాటు చేసే యోచనలో దుర్గగుడి అధికారులు

ఈ ఏడాది రెండు భారీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు

మూలా నక్షత్రం నుంచి గగన నిఘా నిరంతరం

బందోబస్తుకు ‘ఈ’ డిప్లాయ్‌మెంట్‌ యాప్‌

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బందోబస్తును ఈసారి సాంకేతిక మార్గంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గడచిన ఏడాది ఎదురైన అనుభవాలు, జరిగిన తప్పొప్పులను బేరీజు వేసుకుని పోలీసుపరంగా టెక్నాలజీ ఉపయోగించి బందోబస్తును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ వినియోగంలో ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం డీజీపీ స్వయంగా ప్రకటించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో సుమారుగా 7వేల సీసీ కెమెరాలు ఉన్నాయి. శరన్నవరాత్రుల బందోబస్తుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ డిప్లాయ్‌మెంట్‌ యాప్‌తో ముందుకు..

ఈ ఏడాది శరన్నవరాత్రుల్లో పోలీసులు ఈ డిప్లాయ్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం ఒక యాప్‌ను ఇప్పటికే తయారు చేశారు. శరన్నవరాత్రులకే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి భారీ కార్యక్రమం జరిగినా బందోబస్తుకు ఉపయోగించే సిబ్బంది కోసం దీన్ని తయారు చేస్తున్నారు. గడచిన ఏడాది శరన్నవరాత్రుల్లో ఐదు వేల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అదే స్థాయిలో వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరన్నవరాత్రుల్లో బందోబస్తు విధులకు వివిధ జిల్లాల నుంచి సిబ్బందిని రప్పిస్తారు. ఇది కాకుండా బెటాలియన్లలో ఉన్న సిబ్బందిని బందోబస్తుకు నియమిస్తారు. వాళ్లంతా శరన్నవరాత్రులు ప్రారంభానికి ముందు విజయవాడ చేరుకుని అధికారులకు రిపోర్టు చేస్తారు. ఆ సెక్టర్‌ ఇన్‌చార్జిలు వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి విధులు నిర్వహించే ప్రదేశాన్ని కేటాయించేవారు. దీనికి సమయం ఎక్కువ పడుతున్నందున ఈ డిప్లాయ్‌మెంట్‌ యాప్‌ ద్వారా బందోబస్తుకు వచ్చే వారికి సెల్‌ఫోన్‌కు సమాచారం వెళ్తుంది. విధులు ఏ ప్రదేశంలో నిర్వహించాలో అందులోనే ఉంటుంది. అధికారులు జారీ చేసే పాస్‌ డిజిటల్‌గా చేరుతుంది. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది నేరుగా కేటాయించే ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. వారు అక్కడకు చేరుకోగానే ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే హాజరు నమోదవుతుంది. ఇప్పటికే ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. సాంకేతికంగా ఉన్న తప్పొప్పులు సరి చేసే పనులు కమిషనరేట్‌లో జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌లో మొత్తం 3,635 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈ వివరాలన్నీ ఈ డిప్లాయ్‌మెంట్‌ యాప్‌లోకి అప్‌లోడ్‌ చేస్తున్నారు.

రెండు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు

సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ రెండు వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ఈ శరన్నవరాత్రుల్లో రెండు అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఏడాది మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో ఒక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఇక్కడే కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మాదిరిగా కాకుండా భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పోలీసు శాఖ పరంగా ఏర్పాటు చేసే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మోడల్‌ గెస్ట్‌హౌస్‌ పైభాగంలో గానీ, వెనుక వైపున ఘాట్‌కు గెస్ట్‌హౌస్‌కు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఈ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు. సుమారుగా 40 ఎల్‌ఈడీ టీవీలతో వీడియో వాల్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది కాకుండా దుర్గగుడి అధికారులు ప్రత్యేకంగా ఒక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మహామండపంలోని నాలుగో అంతస్తులో దీన్ని ఏర్పాటు చేయడానికి సమాలోచనలు చేస్తున్నారు. దుర్గగుడికి ప్రత్యేకంగా సుమారుగా 250 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మహామండపంలో చిన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మాత్రమే ఉంది. ఇది కాకుండా శాశ్వతంగా ఉండేలా నాలుగో అంతస్తులో 40-50 ఎల్‌ఈడీ టీవీలతో వీడియోవాల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

మూలా నక్షత్రం నుంచే..

శరన్నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది. మూలా నక్షత్రం రోజు నుంచి భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో సుమారుగా లక్ష మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. వారిని నియంత్రించడానికి హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఈసారి మూలా నక్షత్రం ముందు రోజు నుంచి డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయబోతున్నారు. హోల్డింగ్‌ పాయింట్లతోపాటు బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌ వద్ద డ్రోన్లను గాలిలో ఎగరవేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను దసరా వరకు కొనసాగిస్తారు. గడచిన ఏడాది ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజు కంటే దసరా రోజున భక్తులు అత్యధికంగా వచ్చారు. ఈ పరిస్థితి అధికారుల్లో టెన్షన్‌ పుట్టించింది. అప్పటికప్పుడు డ్రోన్లను ఎగరవేసి ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా మూలా నక్షత్రం రోజు నుంచి గగన నిఘాను కొనసాగించాలని నిర్ణయించారు. దీనితోపాటు హోల్డింగ్‌ పాయింట్ల వద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయబోతున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 01:30 AM