AP Govt: టెక్‌తో చెక్
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:57 AM
మొంథా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం మున్ముందు తుఫాన్లను ఎదుర్కోవడంలో ఓ కేస్ స్టడీగా నిలిచిపోనుంది. తుఫాను సమయంలో రియల్ టైం గవర్నెన్స్...
మొంథాను ఎదుర్కొన్న సాంకేతిక పంథా
రియల్‌టైమ్‌లో సేకరించిన సమాచారంతో ముప్పుపై సమగ్ర విశ్లేషణ
దీంతో తీరం వెంబడి ప్రాంతాల్లో బాగా తగ్గిన ప్రాణ, ఆస్తి నష్టం
టెక్నాలజీ వనరుగా అక్కరకొచ్చిన అవేర్ 2.0 వ్యవస్థ
1.1 కోట్ల మెసేజ్‌లతో అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం మున్ముందు తుఫాన్లను ఎదుర్కోవడంలో ఓ కేస్ స్టడీగా నిలిచిపోనుంది. తుఫాను సమయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) చురుగ్గా వ్యవహరించడం వల్లే దాని గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు .. ఎంత మేర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అంచనాలను ఎప్పటికప్పుడు అటు ప్రజలకు.. ఇటు అధికారులకు అందించి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించగలిగామని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మొంథా తుఫాను సమయంలో ఆర్టీజీఎస్ పనిచేసిన తీరును ఆయన వివరించారు. ఆర్టీజీఎస్‌కు 2017లో నాటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పాలనలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించే లక్ష్యంతో దీనికి రూపకల్పన చేశారు. దాని ఫలితాలు మొంథా తుఫాను సమయంలో స్పష్టంగా కనిపించాయి. తుఫాను సమయంలో తాము ఏం చేశామనే అంశాన్ని భాస్కర్ పీపీటీ ప్రజంటేషన్ రూపంలో వివరించారు. దానిలోని ముఖ్యాంశాలు..
గతంలో అలా.. ప్రస్తుతం ఇలా..
గతంలో తుఫాన్ల సమయంలో సమాచారం కోసం భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పైనే ఆధారపడాల్సి వచ్చేది. ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడంలో దీనివల్ల ఆలస్యం జరిగేది. తుఫాను ముందస్తు జాగ్రత్త చర్యల్లోగానీ, తుఫాను అనంతర సహాయక చర్యల్లోగానీ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించేది. ఈసారి ఐఎండీ సమాచారంతోపాటు ఇతరత్రా మార్గాల్లోనూ తుఫాను గమనానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ప్రత్యేకంగా ప్రజలను అప్రమత్తం చేయడానికి అవేర్ 2.0 (ఏపీ వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చి సెంటర్) వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించారు. ఫలితంగా ఏ ప్రాంతంలో తుఫాను తీరాన్ని దాటనుంది.. ఎక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఈ వ్యవస్థ అంచనా వేసింది. సమాచారాన్ని సేకరించడం ఒక ఎత్తు. దాన్ని బాధిత ప్రాంత ప్రజలకు చేరవేయడం మరో ఎత్తు. దీనికి వాట్సాప్ గవర్నెన్స్‌ను పూర్తిస్థాయిలో వాడుకున్నారు. ఫలితంగా ప్రాణనష్టాన్ని పూర్తిస్థాయిలో నివారించగలిగారు. మన మిత్ర ద్వారా.. తమ ప్రాంతంలో చెట్లు పడిపోయాయని, విద్యుత్తు సరఫరా లేదని.. నీటి సరఫరా లేదని తదితర ఫిర్యాదులు 1200 వరకు వచ్చాయి.
602 డ్రోన్లు... 14770 సీసీ కెమెరాల ఫుటేజీ
ముంపు ప్రాంతాలను గుర్తించేందుకు 602 డ్రోన్లు, 14770 సీసీ కెమెరాల ఫుటేజీలను వాడుకున్నారు. వీటన్నింటినీ ఆర్టీజీఎస్ నెట్‌వర్క్‌కు అనుసంధానించి ఏయే ప్రాంతాల్లో ముంపు పరిస్థితి ఉందో తెలుసుకుని అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని శాఖల సమాచారం ఒకచోట క్రోడీకరించి డేటాలేక్‌ను క్రియేట్ చేయడం ద్వారా శాఖల నడుమ పూర్తి స్థాయి సమన్వయం ఉండేలా చూశారు. జేసీబీలు, క్రేన్లు వంటి యంత్రాలను లైవ్ ట్రాక్ చేయడం ద్వారా వాటిని సమర్థవంతంగా వాడుకునే వెసులుబాటు లభించింది. 5,803 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కమాండ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది.
ఆదుకున్న అవేర్ 2.0.
ఫలాన ఊరులో ఉన్న చెరువుకు ఏ సమయంలో ఎంత నీరు చేరే అవకాశం ఉందో కూడా స్థానికులకు, అధికారులకు తెలిపే స్థాయిలో సమాచారాన్ని అవేర్ 2.0. చేరవేసింది. మొంథా తుఫాను రకరకాలుగా ముందుకు సాగుతూ వచ్చింది. అయినా దాని కదలికలను, అందులో వస్తున్న మార్పులను 72 గంటల ముందుగా అంచనా వేసి.. అధికారులను ఈ వ్యవస్థ అప్రమత్తం చేసింది.
వేగంగా వాట్సాప్ గవర్నెన్స్..
తుఫాన్ తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని మిత్ర యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తూ, బాధిత ప్రాంత ప్రజల ఫోన్లకు నిరంతరాయంగా పంపుతూ వచ్చారు. 1.1 కోట్ల మెసేజీలతో ప్రభావిత ప్రాంత ప్రజలను ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి అప్రమత్తం చేశారు
మానిటర్.. అలర్ట్.. రెస్క్యూ..
నష్టాన్ని వీలైనంత తగ్గించడంతోపాటు, శరవేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు మొంథా తుఫాన్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అనుసరించిన ఐదు సూత్రాలివీ..
మరింత బలహీనపడిన మొంథా
3, 4 తేదీల్లో కోస్తాలో వర్షాలు?
విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాన్ మరింత బలహీనపడి గురువారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది సాయంత్రానికి విదర్భ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇంకా ఉత్తరంగా పయనించి శుక్రవారం నాటికి ఉత్తర ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిసరాల వైపు పయనించి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో గురువారం కోస్తాలో ఎక్కువచోట్ల ముసురు వాతావరణం నెలకొని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు ఆనుకుని అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణనిపుణుడొకరు పేర్కొన్నారు. గురువారం గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్‌లో ఉపరితల ఆవర్తనం ఆవరించిందని, ఇదిరానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. దీనిప్రభావంతో తూర్పుగాలులు దక్షిణ భారతం వైపు రానున్నందున నవంబరు 3, 4 తేదీల్లో కోస్తాలో వర్షాలు కురిసే వీలుందన్నారు. శుక్రవారం కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
గతానికి భిన్నంగా చంద్రబాబు
తుఫాను హెచ్చరికలు వచ్చినప్పటినుంచీ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడమనే అంశాలకు చంద్రబాబు నిన్నటివరకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. అందులో భాగంగా అధికారుల్లో సీరియ్‌సనెస్ పెంచడానికి తాను కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటూ వారి వెంటపడేవారు. 1996-97 సూపర్ సైక్లోన్ సమయంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయమే సీఎం కార్యాలయంగా మారిపోయింది. హుద్‌హుద్, బుడమేరు వరదల్లోనూ అదే శైలి! ఇప్పుడు భిన్నంగా ఆర్టీజీఎస్ నుంచి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని మొంథా తుఫాన్ సమయంలో కదిలించారు. తొమ్మిది సార్లు టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి క్షేత్రస్థాయిలో అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటూ వారిలో స్ఫూర్తిని నింపారు. ఆయన తరచూ చెప్పే స్మార్ట్ వర్క్‌కు సాంకేతికతను జోడించి తుఫాను పర్యవేక్షణ చేశారు. డేటా డ్రివెన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మోడల్‌ను ఆవిష్కరించారు.
సీఎం అభినందనలు
మొంథా తుఫాన్ సమయంలో బాగా సేవలు అందించాలంటూ ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌తోపాటు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ జి.శివప్రసాద్, ఐపీఎస్ అధికారి మల్లికా గార్గ్, ఐఏఎస్ అధికారులు ధాత్రిరెడ్డి, సౌర్యమాన్ పటేల్, గీతాంజలి శర్మ, ప్రఖర్‌జైన్ సేవలను సీఎం చంద్రబాబు అభినందించారు.