కరువు నేలకు కన్నీళ్లు!
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:28 AM
కళ్ల ముందే కృష్ణాజలాలు అనంతపురం.. కుప్పం వైపు తరలిపోతున్నాయి.
కళ్ల ముందే కృష్ణమ్మ పరుగులు
అసంపూర్తిగా హంద్రీనీవా పంట కాలువలు
పత్తికొండ జలాశయం నుంచి కుడి కాలువకు నీటి విడుదల
పల్లెల్లో జల జగడాలకు ఆజ్యం పోస్తున్న పాలకుల నిర్లక్ష్యం
రూ.210 కోట్లు ఇస్తేనే కరువు నేల సస్యశామలం
కళ్ల ముందే కృష్ణాజలాలు అనంతపురం.. కుప్పం వైపు తరలిపోతున్నాయి. ఆ నీటిని కరువు నేలకు మళ్లించాల్సిన పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. పత్తికొండ జలాశయం కుడి కాలువకు నీటిని విడుదల చేసినా పొలాలకు మళ్లించలేని దైన్యపరిస్థితి. పంట కాలువలు అసంపూర్తిగా వదలేయడమే కారణం. కుప్పంకు నీళ్లు తీసుకెళ్లామని పాలకులు, ఇంజనీర్లు సంబరాలు చేసుకుంటున్నారు. అదే స్ఫూర్తితో పశ్చిమ ప్రాంతం కరువు, వలసలు నివారించేందుకు పంట కాలువలు పూర్తి చేయక పోవడం విమర్శలకు తావిస్తుంది. ప్రధాన కాలువలో కృష్ణమ్మ ప్రవహిస్తుంది. పక్కనే పంట కాలువలు వెలవెలబోతున్నాయి. డిసి్ట్రబ్యుటరీలు లేకపోవడం.. నీటిని మళ్లించు కోవడానికి రైతులు పోటీ పచ్చని పల్లెసీమల్లో జల జగడాలకు ఆజ్యం పోస్తుంది. పత్తికొండ (పందికోన) జలాశయం కుడి, ఎడమ ప్రధాన కాలువ కింద అసంపూర్తి పంట కాల్వలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ఎగువన 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు హంద్రీనీవా కాలువకు ఎత్తిపోసి, రాయలసీమ జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8టీఎంసీలు వాడుకునే హక్కు ఉంది. నందికొట్కూరు, పాణ్యం, పత్తికొండ, ఆలూరు నియోజక వర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. 0.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కృష్ణగిరి జలాశయం కింద 5.100ఎకరాలు, 1.126 టీఎంసీల సామర్థ్యంతో పత్తికొండ (పందికోన) జలాశయం కుడి కాలువ కింద 10,774 ఎకరాలకు, ఎడమ కాలువ కింద 50,626 ఎకరాలు కలిపి 61,400ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. పూర్తిస్థాయిలో సాగునీరు ఇస్తే పత్తికొండ, దేవనకొండ, ఆస్పరి మండలాలు పచ్చని పైర్లతో సస్య శ్యామలం అవుతాయి. కరువు, వలసలు ఆగిపోతాయి. పంట కాలువలు అసంపూర్తిగా వదిలేయడంతో 17-19వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రూ.3,500కోట్లలో హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఫేజ్-1 పరిధిలో విస్తరణ 90-95 శాతం పూర్తిచేశారు. తొలిసారిగా 2,824 క్యూసెక్కులకు పైగా ఎత్తిపోస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం బ్రాంచి కెనాల్‌కు కృష్ణాజలాలు చేరడంతో సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. రైతులు సంబరాలు చేసుకున్నారు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన పురోగతి. రాయలసీమ కరువు నేలకు ఎక్కడికి నీళ్లు తీసుకెళ్లినా అభినందించాల్సిందే. కళ్ల ముందే కృష్ణాజలాలు తరిలిపోతుంటే.. ఆ నీటిని కరువు నేలకు మళ్లించుకోలేక కష్టజీవులు కన్నీరు పెడుతున్నారు.
ఆయకట్టుకు అందని సాగునీరు
పందికోన జలాశయం కుడి ప్రధాన కాలువకు 140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పంట కాలువలు అసంపూర్తిగా ఉండడంతో చెరువులు నింపుతున్నారే తప్పా ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రధానంగా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, కరివేముల, ప్యాలకుర్తి, తెర్నేకల్లు, ఉమ్మరాళ్ల, మాచాపురం, కొత్తపేట, ఈదుల దేవరబండ, దుప్పనగుర్తి, గోనెగండ్ల మండలంలో ఎర్రబాడు గ్రామాలకు సాగునీరు అందాలి. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం ఉన్నా.. పొలాలకు మళ్లించు కోలేని దుస్థితి. రూ.210 కోట్లు ఇస్తే 45వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందు తుంది.. నిధులు ఇవ్వండని ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలని ప్రధాన కాలువ విస్తరణకు రూ.3,500 కోట్లు వెచ్చించిన పాలక పెద్దలు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసలు నివారించేందుకు రూ.210కోట్లలో అసంపూర్తి కాల్వలు పూర్తి చేయకపోవడం ఇదెక్కడి న్యాయం..? అంటూ కరువు రైతులు ప్రశ్నిస్తున్నారు.
మొదలైన జల జగడాలు
కృష్ణా జలాలు పల్లె చెంతకు చేరాయి.. డిసి్ట్రబ్యులరీలు, పిల్ల కాలువలు లేకపోవ డంతో రైతులు మోటార్ల ద్వారా పొలాలకు మళ్లిస్తున్నారు. అక్కడక్కడ కాలువకు అడ్డంగా వేసి నీటిని మళ్లిస్తుండడం, దిగువ రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుం డడంతో పలు గ్రామాల్లో జల జగడాలు మొదలయ్యాయి. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జల జగడాలు ఎక్కడికి దారితీస్తాయో అని దేవనకొండ మండలానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. డిసి్ట్రబ్యూటరీలు, పిల్ల కాలువలు నిర్మిస్తే ఈ పరిస్థితి ఉండదని అంటున్నారు.
పిల్ల కాల్వలు ఏవీ?
పత్తికొండ రిజర్వాయకు కుడి కాలువ కింద మద్దికుంట, దేవనకొండ పెద్ద చెరువు, చిన్న చెరువు, కొత్తపేట, ఓబులాపురం చెరువు, కరివేముల, ఎర్రబాడు పాత చెరువు, కొత్తచెరువు, మాచాపురం చెరువులను నింపుతున్నామని ఇంజనీర్లు తెలిపారు. చెరువులు సరే.. ఆయకట్టుకు సాగునీరు అందించే పిల్ల కాలువ పరిస్థితి ఏమిటీ..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పత్తికొండ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆలూరు టీడీపీ ఇనచార్జి బి.వీరభద్రగౌడ్‌లు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రూ.210 కోట్లు మంజూరు చేయించి అసంపూర్తి డిసి్ట్రబ్యూటరీలు, పిల్ల కాలువలు పూర్తిచేయాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువ పరిధిలో పిల్ల కాలువలు, డిసి్ట్రబ్యూటరీలు, రోడ్ క్రాసింగ్ బ్రిడ్జిలు అసంపూర్తిగా ఉన్నమాట నిజమే. ఈ పనులకు రూ.210 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రిజర్వాయర్ నుంచి 140 క్యూసెక్కులు విడుదల చేసి, చెరువులు నింపుతున్నాం.
ఫ పాండురంగయ్య, ఎస్‌ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్