Education Department: బడికి.. టీచర్లే లేటు
ABN , Publish Date - Oct 31 , 2025 | 05:56 AM
విద్యార్థులకు సమయపాలన, క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే పాఠశాలలకు ఆలస్యమవుతున్నారు. అందరూ కాకపోయినా ఇలా కొద్ది మంది మాత్రం ప్రతిరోజూ ...
కొద్ది మంది ప్రతిరోజూ ఆలస్యమే
9.30 తర్వాత వచ్చేవారిపై విద్యాశాఖ దృష్టి
వంద పని దినాల హాజరు పరిశీలన
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సమయపాలన, క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే పాఠశాలలకు ఆలస్యమవుతున్నారు. అందరూ కాకపోయినా ఇలా కొద్ది మంది మాత్రం ప్రతిరోజూ ఆలస్యంగానే విధులకు హాజరవున్నట్లు హాజరు గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం.. జూన్ 12న బడులు తెరుచుకున్నాయి. అక్టోబరు 28 వరకు వంద రోజులు పాఠశాలలు పనిచేశాయి. ఆ రోజుల్లో ఉపాధ్యాయుల హాజరును పాఠశాల విద్యాశాఖ పరిశీలించింది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30గంటలు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేస్తాయి. అన్ని పాఠశాలల్లోనూ ఉదయం 9గంటలలోపు టీచర్లంతా బడుల్లో ఉండాలి. తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆలస్యమైతే 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కాగా, గ్రేస్ పీరియడ్ కూడా కాకుండా 9.30గంటల తర్వాత ఎంతమంది టీచర్లు బడులకు వస్తున్నారనేదానిపై పాఠశాల విద్యాశాఖ ఆరా తీసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో 1,94,602 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మొత్తం 100 రోజుల్లో... పది రోజుల్లోపు 1.84లక్షల మంది 9.30 తర్వాత హాజరు నమోదుచేశారు. 11 నుంచి 20 రోజుల పాటు 7060 మంది, 21 నుంచి 30 రోజుల పాటు 1776 మంది, 31 నుంచి 40 రోజుల పాటు 729 మంది, 41 నుంచి 50 రోజుల పాటు 388 మంది ఆలస్యంగా 9.30 తర్వాత హాజరయ్యారు. ఇక 51 నుంచి 60 రోజులపాటు 227 మంది, 61 నుంచి 70 రోజుల పాటు 134 మంది, 71 నుంచి 80 రోజుల పాటు 86 మంది, 81 నుంచి 90 రోజులపాటు 32 మంది, 91 నుంచి వంద రోజుల పాటు ఐదుగురు 9.30 తర్వాతే బడులకు వచ్చారు. ముఖ హాజరులో సాంకేతిక సమస్యలుంటాయనే ఉద్దేశంతో 9.10గంటలను కాకుండా 9.30గంటల తర్వాత హాజరునే ప్రామాణికంగా తీసుకుని పాఠశాల విద్యాశాఖ పరిశీలించింది. అరగంట తర్వాత కూడా వేల మంది టీచర్లు బడులకు హాజరుకావట్లేదని ముఖ హాజరులో తేలింది. వంద రోజుల్లో 15 రోజుల పాటు ఆలస్యంగా వచ్చారంటే ఏవైనా తప్పనిసరి కారణాలుంటాయని, కానీ 15రోజుల దాటి ఆలస్యం కావడం ఏంటనే దానిపై పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. కొందరు టీచర్లైతే ప్రతిరోజూ ఆలస్యంగానే విధులకు హాజరవుతున్నారు.