Share News

AP Teachers Union Federation: సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:48 AM

ఈ నెల 10 నుంచి బోధనేతర విధులు, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

AP Teachers Union Federation: సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం

  • పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలి

  • 12వ పీఆర్సీ, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలి

  • ఈనెల 10 నుంచి బోధనేతర విధుల బహిష్కరణ

  • ‘పోరుబాట’ కార్యక్రమంలో ఫ్యాప్టో నేతల ప్రకటన

విజయవాడ (ధర్నాచౌక్‌), అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఈ నెల 10 నుంచి బోధనేతర విధులు, విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే మరో బీఆర్టీఎస్‌ రోడ్డు తరహా ఉద్యమాన్ని చేపడతామని ఫ్యాప్టో నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నా.. నేటికీ టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. నేటికీ 70 రకాల యాప్‌లలో సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి వస్తుందని వాపోయారు. ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో చేపట్టిన ‘పోరుబాట’ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌.సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విద్యారంగంలో విపరీతంగా పెరిగిపోయిన యాప్‌లతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ ప్రకటించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సానుకూలంగా ఉన్నప్పటికీ.. అధికారులు అలసత్వంగా ఉన్నారని ఆరోపించారు. సీపీఎస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. టీచర్లను విద్య బోధించేందుకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వమిచ్చిన మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని ఫ్యాప్టో చైర్మన్‌ డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ చిరంజీవి మాట్లాడుతూ గిన్నిస్‌బుక్‌ రికార్డులు, యోగాంధ్ర కార్యక్రమాల కోసం ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విద్యాసాగర్‌, డి.వి.రమణ, ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్‌.లక్ష్మణరావు, కత్తి నరసింహరావు ‘పోరుబాట’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 05:49 AM