Teacher Jobs: కుటుంబాల్లో కొలువుల జాతర
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:39 AM
ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెల్లు.. మరో ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు.. ఇంకో ఇంట్లో అక్కాతమ్ముడు.. మరో ఇంట్లో భార్యాభర్తలు.. ఓ
ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి టీచర్ పోస్టులు.. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లకు
కొందరు ఏకంగా 3, 4, 5 ఉద్యోగాలకు అర్హత
కూలీ బిడ్డలకు డీఎస్సీ ర్యాంకులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెల్లు.. మరో ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు.. ఇంకో ఇంట్లో అక్కాతమ్ముడు.. మరో ఇంట్లో భార్యాభర్తలు.. ఓ కుటుంబంలో ఏకంగా ముగ్గురు.. ఇలా ఎందరో టీచర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు. కొందరు ఏకంగా 3, 4, 5 ఉద్యోగాలకు కూడా అర్హత సాధించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది ఓ కల అయితే.. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు టీచర్ ఉద్యోగాలు సంపాదించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మెగా డీఎస్సీ ఫలితాల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. కూలి పనులు చేసేవారు, ఆటో నడిపేవారు, చిన్నాచితక పనులు చేసేవారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఎందరో అర్హత సాధించారు. జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో రెండు, మూడు ర్యాంకులు సాధించినవారూ ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో అందరూ టీచర్లు కావడం విశేషం. తాజా డీఎస్సీ 16,347 మంది జీవితాల్లో వెలుగులు నింపింది.
రాణించిన అక్కాతమ్ముడు
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన బాలునాయక్, లీలాబాయి దంపతుల కొడుకు, కుమార్తె ఇద్దరూ ఒకేసారి మెగా డీఎస్పీలో ఉద్యోగాలు సాధించారు. కుమార్తె విజయలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ హిందీలో జిల్లాస్థాయి మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఆమె తమ్ముడు శ్యామ్‌సుందర్ నాయక్ ఎస్జీటీ ఇంగ్లిష్ విభాగంలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంక్ సాధించారు. ఒకేసారి ఇద్దరికీ ఉద్యోగాలు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలునాయక్, లీలాబాయి దంపతులు రైల్వే స్టేషన్ సమీపంలో మాంసం దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.

సత్తాచాటిన అన్నదమ్ములు
కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన అన్నదమ్ములు టీచర్ ఉద్యోగాలు సాధించారు. నాగరాజు స్కూల్ అసిస్టెంట్ విభాగం(బయాలజీ)లో 85.6782 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నారు. దీంతో పాటు ఎస్జీటీలో కూడా అర్హత సాధించారు. తమ్ముడు సంపత్‌కుమార్ టీజీపీ(తెలుగు) విభాగంలో జిల్లాలో ఐదో ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 50వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. వీరిది పత్తికొండ మండలం హోసూరు గ్రామం. తండ్రి ఒడుగూరు లింగన్న, తల్లి ఆదిలక్ష్మిలకు నలుగురు కుమారులు. కూలి పనులు చేస్తేనే వీరి కుటుంబం గడిచేది. తండ్రి మరణించడంతో మొదటి, రెండవ కుమారుడు కూలి పనులతో పాటు ఆటో నడుపుతూ తమ్ముళ్లను ఉద్యోగం వైపు నడిపించారు.

కూలీ కుమార్తెకు 3 ర్యాంకులు
విశాఖ నగర పరిధిలోని పోతినమల్లయ్యపాలెం ఆర్‌ఎస్ కాలనీకి చెందిన రెడ్డి మహాలక్ష్మి మూడు కేటగిరీల్లో ర్యాంకులు సాధించారు. తండ్రి సత్యనారాయణ కూలి పనులు చేస్తూ ఆమెను చదివించారు. స్కూల్ అసిస్టెంట్ (హిందీ పండిట్) కేటగిరీలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు, పీజీటీ జోన్-1 స్థాయిలో ఐదో ర్యాంకు, టీజీటీ జోన్-3 స్థాయిలో ఎనిమిదో ర్యాంకు కైవసం చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ (హిందీ పండిట్) ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని మహాలక్ష్మి తెలిపారు.

ఒకే కుటుంబంలో నలుగురు టీచర్లు
తాడేపల్లిగూడెంకు చెందిన వి.వేణుమాధురి రెండు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉద్యోగాలు సాధించారు. తండ్రి మోహనరావు స్కూల్ అసిస్టెంట్‌గా, తల్లి శ్రీలక్ష్మి ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంగా, అక్క అనుచందన మున్సిపల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఉపాధ్యాయులు ఉండటం ప్రత్యేకత.

ఒకేసారి నాలుగు ఉద్యోగాలు
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద అమిరానికి చెందిన బూరాడ వెంకటకృష్ణ ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్, పీజీటి మ్యాథ్స్‌తో పాటు ప్రిన్సిపాల్ పోస్టు సాధించారు. ఆయన భార్య వరలక్ష్మి వేంపాడు గ్రామంలో ఎంపీపీ పాఠశాలలలో టీచర్‌గా పని చేస్తున్నారు.
నాలుగు కొలువులు
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన ఇరువూరి కృష్ణారెడ్డి, పద్మజల కుమార్తె ఇరువూరి వెంకట హర్షిత నాలుగు పోస్టులకు అర్హత పొందారు. సోషల్ స్డడీ్‌సలో జిల్లా ఫస్ట్ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్‌లో 16వ ర్యాంకు, ఎస్జీటీలో 7వ ర్యాంకు, మోడల్ స్కూల్స్ జాబితాలో 4వ ర్యాంకు సాధించారు.
అర్హత సాధించిన అక్కాచెల్లెలు..
ఒకరికి 5 పోస్టులు
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మహబూబ్‌నగర్‌కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు ఖాదర్‌బాషా కుమార్తెలు మెహతాజ్, రేష్మా డీఎస్పీ మెరిట్ ఫలితాల్లో అర్హత సాఽధించారు. మెహతాజ్ ఐదు పోస్టులకు ఎంపిక కావడం విశేషం. ఎస్జీటీ, ఎస్‌ఏ (తెలుగు), ఎస్‌ఏ(సోషల్), టీజీటీ (తెలుగు), టీజీటీ (సోషల్) ఉద్యోగాలు సాధించారు.
కానిస్టేబుల్.. 4 టీచర్ పోస్టులు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి మోహన్‌కు తండ్రి లేరు. తల్లి కువైట్‌లో ఉన్నారు. ఆయన దూర విద్యావిధానంలో బీఏ, బీఈడీ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో మూడో ర్యాంకు సాధించారు. తాజాగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాలో 23వ ర్యాంకు, తెలుగు విభాగంలో 27, ఎస్జీటీ విభాగంలో 26, టీజీటీ సోషల్ విభాగంలో 35వ ర్యాంకు పొందారు.
అక్కాచెల్లెళ్లు అదుర్స్
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఒకే కుటుంబం నుంచి అక్కా చెల్లెళ్లు డీఎస్సీలో సత్తా చాటారు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్ను నాగరాజు, నాగమణి దంపతుల ఇద్దరు కుమార్తెలు డీఎస్సీ ఫలితాల్లో రాణించారు. పెద్ద కుమార్తె రేచెల ఎస్‌జీటీలో 84.83941 మార్కులతో జిల్లాలో 275వ ర్యాంక్, చిన్నకుమార్తె హరిత స్కూల్ అసిస్టెంట్(గణితం)గా 81.55 మార్కులతో జిల్లాలో పదో ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. హరిత టీజీటీ (గణితం)లోనూ 78.823 మార్కులతో జోనల్ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించారు.

భార్యాభర్తలు.. ఫిజిక్స్ టీచర్లు
కడప జిల్లా కాశినాయన మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఫిజిక్స్ టీచర్లుగా ఎంపికయ్యారు. పాలకొలను సుబ్బారెడ్డ్డి ఫిజిక్స్‌లో 77.79 మార్కులతో 3వ ర్యాంక్, ఆయన భార్య వనిపెంట శ్రీలత 75.27 మార్కులతో 13వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి ఖాజీపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండగా, శ్రీలత సమీపంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో టీచర్‌గా ఉన్నారు.

ఒకే ఇంట్లో ముగ్గురు టీచర్లు
కడప నగరానికి చెందిన ఓ కుటుంబంలో ఏకంగా ముగ్గురికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. అందులోనూ భార్యాభర్తలకు జిల్లా మొదటి ర్యాంకు రావడం విశేషం. సయ్యద్ సనావుల్లా ఉర్దూ ఎస్జీటీగా చాపాడు మండలంలో పనిచేస్తున్నారు. మెగా డీఎస్సీ 2025లో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్‌లో 59.87 మార్కులతో జిల్లా మొదటి ర్యాంక్ సాధించారు. ఆయన భార్య నజీహా కరిమ్ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. 84.07 మార్కులతో ఎస్జీటీ ఉర్దూ విభాగంలో మొదటి ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అలాగే సయ్యద్ సనావుల్లా సోదరి సయ్యద్ రేష్మ ఉర్దూ ఎస్జీటీ ఈడబ్ల్యూఎస్ విభాగంలో జిల్లా 20వ ర్యాంక్ తెచ్చుకున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో బంధుమిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.
ఒకేసారి మూడు ఉద్యోగాలు
శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కుమార్ డీఎస్సీలో ఒకేసారి మూడు ఉద్యోగాలు సంపాదించారు. పీజీటీ సోషల్ స్టడీ్‌సలో జిల్లా స్థాయి 2వ ర్యాంక్(73 మార్కులు), స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీ్‌సలో జిల్లా స్థాయి 7వ ర్యాంక్(83.39 మార్కులు), టీజీటీ సోషల్ స్టడీ్‌సలో 10వ ర్యాంక్ (79.12 మార్కులు) సాధించారు. 2012 నుంచి డీఎస్సీ పరీక్షలు రాస్తున్నారు. ప్రతిసారి తృటిలో ఉద్యోగం కోల్పోయినా నిరాశ చెందకుండా కృషి చేసి అద్భుత విజయం సాధించారు. తన తల్లి, భార్య ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని ఉదయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ముదిగుబ్బ మండల పరిధిలోనే ఎనుములవారిపల్లి గ్రామానికి చెందిన గంజపురి రేవతి మూడు ఉద్యోగాలకు అర్హత సాధించారు. డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో 9వ ర్యాంక్‌తో స్కూల్ అసిస్టెంట్, 6వ ర్యాంక్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు అర్హత పొందారు. వీరిది రైతు కుటుంబం.