Innovative Teaching: బొమ్మలు, ఆటపాటలతో పాఠాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:41 AM
అందరిలా మూస పద్ధతిలో విద్యాబోధన చేస్తే ప్రయోజనం ఏం ఉంటుంది..? అందుకే కాస్త సృజనాత్మకతను జోడిస్తూ..
మండపేట శారద మున్సిపల్ స్కూల్ టీచర్ వినూత్న బోధన
మంత్రి లోకేశ్ మన్ననలు పొందిన ఉపాధ్యాయురాలు కావేరి
మండపేట, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): అందరిలా మూస పద్ధతిలో విద్యాబోధన చేస్తే ప్రయోజనం ఏం ఉంటుంది..? అందుకే కాస్త సృజనాత్మకతను జోడిస్తూ.. ఆటపాటలు, బొమ్మలతో పాఠాలు చెబితే పిల్లలు ఆసక్తిగా వింటారు. ఇలాగే వినూత్నంగా పాఠాలు చెబుతూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ మన్ననలు అందుకున్నారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని శారద మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయురాలు అమలదాసు కావేరి. శారద మున్సిపల్ పాఠశాలలో 2020లో ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరిన కావేరి.. ఆ తర్వాత డిప్యుటేషన్‌పై వివిధ పాఠశాలల్లో పనిచేశారు. ఇటీవలే ఆమె డిప్యుటేషన్ పూర్తవడంతో తిరగి శారద పాఠశాలకు వచ్చారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు జీరో ఉండడంతో తానే స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను చేర్పించాలని కోరారు. ఆమె చొరవతో ప్రస్తుతం పిల్లల హాజరు 11కు పెరిగింది. ఒకటో తరగతిలో 10 మంది, రెండో తరగతిలో ఒకరికి విద్య నేర్పిస్తున్నారు. కావేరి పిల్లలు ఇష్టపడేలా వారికి సులభంగా అర్థమయ్యేలా బోర్డు మీద బొమ్మలు వేస్తూ, ఆటపాటలతో రీల్స్ చేస్తూ విద్యాబోధన చేస్తున్నారు. అలాగే పాఠశాల ఆవరణలో కూరగాయలు, ఆకుకూరలు, ఉద్యాన పంటలు పండించడం ద్వారా విద్యార్థులను చైతన్య పరుస్తున్న తీరు చూసి మంత్రి లోకేశ్ ఆమెను అభినందించారు. తన పనితీరును అభినందించిన మంత్రి లోకేశ్‌కు కావేరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.