Cyber Scam: ఉపాధ్యాయుడికి సైబర్ ఉచ్చు
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:02 AM
మీరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఢిల్లీ, ముంబైల్లో మీపై సీబీఐ కేసులు నమోదయ్యాయి’ అంటూ ఫోన్‌చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి రూ.22 లక్షలు గుంజేశారు.
ఆరు విడతల్లో 22 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
బొబ్బిలిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
బొబ్బిలి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘మీరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఢిల్లీ, ముంబైల్లో మీపై సీబీఐ కేసులు నమోదయ్యాయి’ అంటూ ఫోన్‌చేసి బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి రూ.22 లక్షలు గుంజేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. బొబ్బిలికి చెందిన ఈ ఉపాధ్యాయుడికి సెప్టెంబరు 16న గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని.. ‘మీరు లైంగిక వేధింపులు, మహిళల అక్రమ రవాణాకు (ఉమెన్ ట్రాఫికింగ్) పాల్పడుతున్నారు. మీపై ముంబైలో, ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదయ్యాయి’ అని చెప్పారు. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని బెదిరించారు. అనంతరం వీడియో కాల్ చేసి పోలీసు దుస్తుల్లో కనిపించారు. కోర్టు దృశ్యాలను చూపించి భయపెట్టారు. ఇలా 21 రోజులపాటు ఫోన్లు చేస్తూ బెదిరించడంతో ఆ ఉపాధ్యాయుడు భయాందోళనకు గురయ్యారు. కేసు నుంచి బయటపడాలంటే ఫైన్ కింద కొంత డబ్బులు చెల్లించాలని, మీరు తప్పుచేయలేదని తేలితే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. రిజర్వ్ బ్యాంకు రాజముద్రతో కూడిన రశీదును కూడా పంపడంతో ఆ ఉపాధ్యాయుడు నిజమేనని నమ్మేశారు. ఆ తర్వాత వారు చెప్పిన ఖాతాలకు దశలవారీగా రూ.22 లక్షలు చెల్లించారు. ఇది జాతీయ భద్రత వ్యవహారం కాబట్టి.. ఎవరికీ చెప్పకూడదని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. దీంతో ఆయన ఎవరికీ చెప్పకుండా బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి కొంత, స్నేహితుల దగ్గర నుంచి మరికొంత అప్పుగా తీసుకొని రూ.22 లక్షలు (యూపీఐ పేమెంట్) 6విడతలుగా ముట్టజెప్పారు. ఆ తర్వాత అటునుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ఆయన బుధవారం విలేకరులకు జరిగిన విషయాన్ని తెలియజేస్తూ వాపోయారు.