TDP Unopposed Win: 3 ఎంపీటీసీ, 2 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:55 AM
వైసీపీ అధినేత జగన్‌రెడ్డి ఇలాకాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఈ రెండు స్థానాలకు 12న పోలింగ్ జరగనుంది.
అన్నీ టీడీపీ బలపరిచిన వారికే
జగన్ ఇలాకాలో ‘ఉప’ పోరు షురూ
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు 12న ఎన్నికలు
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌రెడ్డి ఇలాకాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఈ రెండు స్థానాలకు 12న పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలను 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి కడప జడ్పీ చైర్మన్‌గా ఎన్నికై, 2024లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికల అనివార్యమయ్యాయి. పులివెందుల స్థానం నుంచి మహేశ్వరరెడ్డి తనయుడు హేమంత్ కుమార్ వైసీపీ బలపర్చిన అభ్యర్థిగా బరిలో ఉండగా, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో పులివెందుల ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ బలపర్చిన అభ్యర్థిగా ఇరగం సుబారెడ్డి, టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా ఎ.ముద్దుకృష్ణా రెడ్డి పోటీపడుతున్నారు. ఇక, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ముణేంద్రం, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వేపకారిపల్లి, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు-1 ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండెపి, కడియపులంక సర్పంచి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.