AP CM Chandrababu Naidu: 16న టీడీపీ జిల్లా కమిటీలు ఖరారు
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:06 AM
పార్టీ పదవుల్లో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కమిటీల్లో సభ్యుల సంఖ్య 32 నుంచి 40కి పెంపు
పార్టీ పదవుల్లో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం
కులాలకు జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం
తొలి నుంచీ టీడీపీ విధానం అదే: చంద్రబాబు
త్రీమెన్ కమిటీలకు దిశానిర్దేశం
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పార్టీ పదవుల్లో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మంత్రులు, జిల్లా కమిటీల ఎంపిక కోసం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. పార్టీ జిల్లా కమిటీల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమాజంలో అధికసంఖ్యలో జనాభా ఉన్న కులాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, టీడీపీ ఆవిర్భావం నుంచి అదే విధానాన్ని అవలంభిస్తున్నామని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించింది టీడీపీయేనని, అదే విధంగా మిగిలిన కులాలకూ రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కమిటీల నుంచే సోషల్ ఇంజనీరింగ్‌ను ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో ఉన్న కులాల జనాభా ఆధారంగా అదే దామాషాలో జిల్లా కమిటీకి సభ్యులను ఎంపిక చేయాలన్నారు. జిల్లా కమిటీల్లో ప్రస్తుతం అధ్యక్ష, కార్యదర్శులు కాకుండా 32 మంది సభ్యులు ఉండగా, ఆ సంఖ్యను 40కి పెంచాలని నిర్ణయించారు.
26 జిల్లాలకు సిద్ధం చేసిన కమిటీల సభ్యుల వివరాలను కులాలవారీగా అధ్యయనం చేసిన పార్టీ బ్యాక్ ఆఫీసు సిబ్బంది సీఎంకు అందించగా.. దాని ప్రకారం ఓసీలు 34 శాతం, బీసీలు 41 శాతం, ఎస్సీలు 7 శాతం, ఎస్టీలు 3 శాతం, ఇతరులు 4 శాతం ఉన్నారని సీఎం చెప్పారు. మైనార్టీ కులాలు 40 వరకు ఉన్నాయని, మరో 8 ఇతర కులాలకు కమిటీల్లో తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎక్కువ జనాభా ఉన్న కులాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే వారు రాజకీయంగా ఎప్పటికి ఎదగాలని సీఎం ప్రశ్నించారు. ఓసీల శాతం తగ్గించాలని, ఎస్సీలకు 1 శాతం పెంచాలని, మైనార్టీలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలకు 33 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని లేనిపక్షంలో కనీసం 26 శాతం తగ్గకుండా చూడాలని సూచించారు. జిల్లాలవారీగా కులాల జాబితాను త్రీమెన్ కమిటీలకు అందిస్తామని, 15వ తేదీనాటికి జిల్లా కమిటీల జాబితాలను సిద్ధం చేసి తనకు అందివ్వాలని ఆదేశించారు. 16న మరోసారి సమావేశమై జిల్లా కమిటీలను ఖరారు చేద్దామని సీఎం స్పష్టం చేశారు.