TDP: కొత్త నేతలకు పార్టీ పదవులు
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:19 AM
టీడీపీని మరింత బలోపేతం చేస్తున్నామని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...
క్లస్టర్ ఇన్‌చార్జులకు జిల్లా కమిటీల్లో చోటు
కమిటీ నియామకంలో సోషల్ ఇంజనీరింగ్
పార్టీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు
6న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’కు శ్రీకారం
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): టీడీపీని మరింత బలోపేతం చేస్తున్నామని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగుదేశం సిద్ధాంతం చాలా బలమైంది. అందుకే ఇన్నేళ్లుగా ప్రజాదరణ పొందుతోంది. పార్టీపై దృష్టి సారించా. పార్టీలో కింది స్థాయి నుంచి పై వరకు బలమైన నిర్మాణం చేస్తున్నాం. పార్లమెంటు కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలి. కమిటీ నియామకంలో సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. యువతకు అవకాశం కల్పించాలి. అన్ని వర్గాల నుంచి బలమైన నేతలకు అవకాశం ఇవ్వా లి.’’ అని తేల్చిచెప్పారు. మొహమాటాలకు పోయి బలహీనంగా ఉన్న వారికి పదవులు ఇస్తే ప్రభుత్వం, పార్టీ కూడా నష్టపోతాయని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీ పదవుల్లో ఉండి.. కార్పొరేషన్ల చైర్మన్‌లో, ఇతర పదవులో పొందిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నట్టు చంద్రబాబు వివరించారు.
బాధ్యతగా ఉండాలి..
పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ, ప్రభుత్వ స్థాయిని పెంచేలా నేతల తీరు ఉండాలన్నారు. ఆరోపణలు రాకుండా చూసుకోవాలని, తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని తేల్చి చెప్పారు. రెండో అవకాశం కూడా ఇవ్వబోనన్నారు. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు ఎవ్వరిపైనా ఆరోపణలు రాకూడదనే లక్ష్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ‘‘మీపైన ఆరోపణలు వస్తే వాటిలో మీ ప్రమేయం లేదని మీరే నిరూపించుకోండి. పార్టీ మీకు అండగా నిలుస్తుంది. మీ కారణంగా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగకూడదనే బాధ్యతతో పని చేయండి. ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు సమయం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలి. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి.’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
1 నుంచి క్యాడర్‌కు శిక్షణ
వచ్చే నెల 6న అనంతపురంలో ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు, వచ్చే నెల 1 నుంచి పార్టీ క్యాడర్‌కు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.
నెలాఖరులోగా కొలిక్కి!
పార్లమెంటరీ పార్టీ కమిటీల నియామకంపై చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. ఈ కమిటీల ఏర్పాటు కోసం నియమించిన త్రిసభ్య కమిటీలతో జరిగిన సమావేశంలో ఈ నెలాఖరులోగా సంస్థాగత ఎన్నికల కసరత్తు కొలిక్కి రావాలని దిశానిర్దేశం చేశారు. 24, 25, 26 తేదీల్లో పార్లమెంటు కమిటీలకు ప్రతిపాదనలు స్వీకరించేందుకు సమావేశాలు జరగనున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 34 మంది సభ్యులతో టీడీపీ పార్లమెంటు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈసారి కొత్తగా పార్టీ కార్యాలయ, సోషల్ మీడియా, మీడియా కార్యదర్శులకూ పార్లమెంటు కమిటీలో స్థానం కల్పించారు. టీడీపీ పార్లమెంటు కమిటీతోపాటు 28 మందితో అనుబంధ విబాగాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ సామాజికవర్గాలకు సంబంధించి పార్లమెంటు పరిధిలో 54 సాధికార సమితులు ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంటు పరిధిలోని పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని కమిటీలను భర్తీ చేస్తారు.