Jayachandra Reddy: నకిలీ మద్యం.. ఇద్దరు టీడీపీ నేతలపై వేటు
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:29 AM
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది....
తంబళ్లపల్లి ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి,
కట్టా సురేంద్ర నాయుడు సస్పెన్షన్
అమరావతి/రాయచోటి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. ఈ విషయంలో టీడీపీ నాయకుల ప్రమేయంపై వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రా రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పల్లా ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఈ ఇద్దరి ప్రమేయంపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడు
నకిలీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్, సన్నిహితుడు జనార్దన్‌రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జయచంద్రారెడ్డి, కేసులో ఏ-1గా ఉన్న జనార్దన్‌రావు దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు తెలిసింది. జయచంద్రారెడ్డి వ్యవహారం మొదట నుంచీ వివాదాస్పదంగానే ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా.. దక్షిణాఫ్రికాలో ఆ కుటుంబంతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. టీడీపీ అధిష్ఠానం 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్ ఇచ్చింది. 10వేలకు పైగా ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఏమాత్రం కృషి చేయలేదని అప్పట్లో టీడీపీ వర్గాలు ఆరోపించాయి. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచీ నియోజకవర్గంలో అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుని వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారం ఆయన మెడకు చుట్టుకోవడంతో అధిష్ఠానం ఆయనపై వేటు వేసింది.