Share News

Palla Srinivasa Rao: ఒక్క ఓటరుకూ అన్యాయం జరగొద్దు

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:42 AM

అర్హులైన ఏ ఒక్క ఓటరుకు అన్యాయం జరగకుండా ఓటర్ల జాబితా సవరణలో న్యాయమైన, పారదర్శక విధానాలను అమలు చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Palla Srinivasa Rao: ఒక్క ఓటరుకూ అన్యాయం జరగొద్దు

  • జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి

  • యూనిక్‌ ఓటరు ఐడెంటిటీతో నకిలీలకు చెక్‌

  • కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సూచనలు

అమరావతి/ఢిల్లీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): అర్హులైన ఏ ఒక్క ఓటరుకు అన్యాయం జరగకుండా ఓటర్ల జాబితా సవరణలో న్యాయమైన, పారదర్శక విధానాలను అమలు చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధానంలో సంస్కరణలు, ఓటర్ల జాబితా సవరణలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌, కమిషనర్లు వివేక్‌ జోషి, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ తరఫున పల్లాతోపాటు ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయులు, బైరెడ్డి శబరి, దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న హాజరయ్యారు. పల్లా మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని, క్షేత్రస్థాయి అధికారుల నియామకంలో పారదర్శకతను పాటించాలని సూచించారు. బీఎల్‌వోలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.250 ప్రోత్సాహకాన్ని పెంచాలని కోరారు. నకిలీ ఓటర్లను తొలగించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి ఓటరుకు ప్రత్యేక డోర్‌ నంబరు కేటాయించడం ద్వారా డేటా చోరీని నిరోధించి, యూనిక్‌ ఓటరు ఐడెంటిటీని సృష్టించవచ్చని తెలిపారు. ఓటరు జాబితా సవరణలో బూత్‌ స్థాయి ప్రతినిధులను అన్ని దశల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు.


రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ

రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) చేపట్టాలని ఎన్నికల సంఘానికి పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. 2029 వరకు ఎన్నికలు లేకపోవడంతో ఏపీలో త్వరలోనే ఎస్‌ఐఆర్‌ ప్రారంభించి, ఎన్నికలకు కనీసం 6 నెలల ముందు పూర్తి చేయాలని కోరారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.అపోహలకు తావులేకుండా సంస్కరణలు అమలు చేయాలన్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా ఓటరు జాబితా సవరణ చేయాలన్నారు.


ఎన్నికల సంఘానికి టీడీపీ సూచనలు

  • ఓటర్ల జాబితాపై కాగ్‌ ఆధ్వర్యంలో ఏటా థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిర్వహించాలి.

  • జాబితాలో తప్పులు సరిదిద్దేందుకు బూత్‌స్థాయి లేదా ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి వద్ద ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

  • ఆధార్‌ సాయంతో నకిలీ ఎపిక్‌ నంబర్లను గుర్తించాలి.

  • పునరావృతం కానీ ఎపిక్‌ నంబర్ల జారీని వేగవంతం చేయాలి.

  • ఇంక్‌కు బదులు బయోమెట్రిక్‌ ధ్రువీకరణను అమలు చేయాలి.

  • బూత్‌ స్థాయి ఏజెంట్లకు ముందుగా ముసాయిదా జాబితాలు ఇవ్వాలి

  • జిల్లాల వారీగా ఓటర్ల చేర్పులు, తొలగింపుల డేటాను ఈసీఐ పోర్టల్‌లో ఉంచాలి.

  • ఓటర్ల ఫిర్యాదులు, పరిష్కారాలను తెలుసుకునేందుకు రియల్‌టైం డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలి.

  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈఆర్‌వోలు, జిల్లా ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలి. జరిమానాలను విధించాలి.

  • ఎన్నికలపై ప్రభావం పడకుండా బీఎల్‌వోలు, ఈఆర్‌వోలను మార్చాలి.

  • ఫిర్యాదులను పరిష్కారానికి రాష్ట్రస్థాయి అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలి.

  • వలసదారులు, గిరిజనులు, వృద్ధులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలి.

  • సంచారజాతులు ఓటు హక్కు కోల్పోకుండా ప్రాథమిక పత్రాలు అనుమతించాలి.

  • ఓటర్ల జాబితాపై ప్రతి నెలా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.

Updated Date - Jul 16 , 2025 | 05:49 AM