CM Chandrbabu: జూబ్లీహిల్స్‌లో పోటీకి టీడీపీ దూరం
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:35 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీకీ పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఎవరికీ మద్దతివ్వకూడదని నిర్ణయం.. నేతలతో చంద్రబాబు భేటీ
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చ
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీకీ పార్టీ శ్రేణులు సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పార్టీ నాయకులతో చర్చించాక సీఎం చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు కోరారు. రాష్ట్ర అధ్యక్షునితోపాటు రాష్ట్ర కమిటీ నియామకంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం పూర్తయ్యిందని, సంస్థాగత నిర్మాణం పూర్తిచేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు క్రియాశీలకంగా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు వివరించారు. అధ్యక్షుడి నియామకం ఆలస్యమైతే.. ఈలోపు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు.. కమిటీల నియామకం పూర్తి చేసుకుని కార్యక్రమాలు పెంచాలని సూచించారు. సమర్థవంతంగా బాధ్యతలు నెరవేర్చేవారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు.