Mithun Reddy: టీడీపీ మాపై కేసులు పెట్టడం మామూలే
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:31 AM
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేసులు పెట్టి తమను వేధించడం మామూలేనని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు..
2014లో కూడా తప్పుడు కేసులు పెట్టారు: మిథున్‌రెడ్డి
తిరుపతి(జీవకోన), అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కేసులు పెట్టి తమను వేధించడం మామూలేనని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. 2014లో కూడా తప్పుడు కేసులు పెట్టారని.. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు. బుధవారం తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాపై కేసు పెట్టి మా తల్లిదండ్రులను మానసికంగా వేధించడం, పైశాచిక ఆనందం పొందడం తప్ప సాధించిందేమీ లేదు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి, పాలిటిక్స్ చేయడంపై దృష్టి సాధించింది. జైలులో ఉన్నన్ని రోజులు, కష్టకాలంలో అండగా ఉన్న వైఎస్ జగన్, వైసీపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. మేం బీజేపీలో చేరతామని టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. జైలులో ఓ టెర్రరిస్టులా, తీవ్రవాదిలా పెట్టారు. సీసీ కెమెరా నిఘా ఉంచారు. ఇతరులతో మాట్లాడే పరిస్థితి లేదు. కోర్టు ఆదేశాలిచ్చే వరకు ఏ వసతీ కల్పించలేదు. ఖైదీలకు ఇచ్చే వసతులు కూడా నాకు ఇవ్వలేదు’ అని ఆరోపించారు. కోర్టు ఆంక్షల మేరకు అన్ని విషయాలూ మాట్లాడలేనని, బెయిల్ ఆర్డర్‌ను అందరూ చదవాలని.. అందులో అన్ని విషయాలూ స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. సమావేశంలో వైసీపీ నేతలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సునీల్, రెడ్డెప్ప, భరత్ తదితరులు పాల్గొన్నారు.