TDP: అబద్ధాల రాతలతో అతుకుల బొంత
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:25 AM
తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని సామెత! అలాగే... వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అంటిన బురదను అందరికీ పూయాలని ఆరాట పడుతున్నారు. అక్రమాలు, అవినీతి సొమ్ముకు పుట్టిన తన రోత పత్రికను ఇందుకోసం వాడుతున్నారు.
జగన్ రోత పత్రిక బురద కథలు
రూ.11 కోట్ల నగదు చంద్రబాబే పెట్టించారట
తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషేనట!
ఎక్కడో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీతో దిగిన ఫొటో చూపించి...‘ఇద్దరూ దగ్గరే’అని చిత్రాలు
మోకాలికీ బోడిగుండుకూ ముడిపెట్టి వెర్రితనం
సొంత పాఠకుల చెవిలో జగన్ పూలు
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి శ్రీలంక వెళ్తుండగా వెంకటేశ్‌నాయుడు అరెస్టు
ఇద్దర్నీ ఒకేసారి బెంగళూరులో పట్టుకున్న సిట్
అయినా..సంబంధం లేదంటారా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని సామెత! అలాగే... వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అంటిన బురదను అందరికీ పూయాలని ఆరాట పడుతున్నారు. అక్రమాలు, అవినీతి సొమ్ముకు పుట్టిన తన రోత పత్రికను ఇందుకోసం వాడుతున్నారు. లిక్కర్ స్కామ్‌లో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుండటం, ‘సిట్’ సాంకేతిక ఆధారాలతో సహా అరెస్టులు చేస్తుండటంతో దిక్కుతోచక పిచ్చి కథలు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగానే.. మంగళవారం సంచికలో ‘సూత్రధారి చంద్రబాబే’ అంటూ ఒక కథనాన్ని వండి వార్చారు. ఇటీవల సిట్ అధికారులు శంషాబాద్ మండలం కాచారం గ్రామ పరిధిలోని ఫామ్‌హౌ్‌సలో రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు... తీగల విజయేందర్ రెడ్డి కుటుంబానికి చెందిన వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఫామ్‌హౌస్‌లో ఈ డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి భార్య, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని ఒక ఆస్పత్రిలో భాగస్వాములు. విజయేందర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి సన్నిహితులని సిట్ నిర్ధారించింది. అయితే... జగన్‌ను ఇరికించేందుకు చంద్రబాబే స్వయంగా తీగల విజయేందర్ రెడ్డి చేత ఫామ్ హౌస్‌లో రూ.11 కోట్లు పెట్టించారని, ఆ సొమ్మునే ‘సిట్’ అధికారులు పట్టుకున్నారని రోత పత్రిక అబద్ధాల రాతలు రాసింది.
తీగల విజయేందర్ రెడ్డి... టీడీపీ నేత తీగల కృష్ణా రెడ్డికి తమ్ముడి కుమారుడు కాబట్టి... తీగల కృష్ణా రెడ్డి టీడీపీ నాయకుడు కాబట్టి... విజయేందర్ రెడ్డి ద్వారా రూ.11 కోట్లు ఫామ్‌హౌస్‌లో పెట్టించి, అవే డబ్బులు పట్టించారని అతుకుల బొంతను సృష్టించింది. కనీస ఔచిత్యం, పరిజ్ఞానంలేకుండా సొంత పాఠకుల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించింది.
ఎవరినో కేసులో ఇరికించేందుకు... ఇంకెవరి కోసమో ఏకంగా రూ.11 కోట్ల నగదును వదులుకునేందుకు ఎవరైనా సిద్ధపడతారా? తీగల విజయేందర్ రెడ్డికి ఎన్ని వందలకోట్లయినా ఉండొచ్చు! టీడీపీ నేతల కోసం రూ.11 కోట్లతోపాటు తనప్రతిష్ఠనూ కోల్పోయేందుకు ఇష్టపడతారా?
‘టీడీపీ నేత తీగల కృష్ణా రెడ్డి’ అని రోత పత్రిక పెద్ద అక్షరాలతో రాసింది. తీగల ఒకప్పుడు టీడీపీ నేత. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరారు. తెలుగుదేశం పార్టీతో దాదాపు దశాబ్దకాలంగా ఆయనకు ఎలాంటి సంబంధాలూ లేవు! అయినా సరే... ఆయనను టీడీపీ నేతగా పేర్కొంది.
పనిలోపనిగా... తీగల విజయేందర్ రెడ్డి ఒక ఆస్పత్రి ఫంక్షన్‌లో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణతో దిగిన ఫొటోను సంపాదించి.. ‘ఆయనకూ దగ్గరేనండీ’ అని రోత పత్రిక చిత్రాలు పోయింది. ఇక్కడ... రాధాకృష్ణ ఇంటికి తీగల విజయేందర్ రెడ్డి వెళ్లలేదు. ఆయన ఇంటికి ఈయన రాలేదు. మూడో వ్యక్తికి సంబంధించిన కార్యక్రమంలో యాథృచ్ఛికంగా కలిశారు.
వెంకటేశ్ నాయుడు ఒక పవర్ బ్రోకర్. ‘పనులు చేసి పెడతా’ అంటాడు. ఆయా పార్టీల నేతలందరి దగ్గరికి వెళ్లి ఫొటోలు దిగుతారు. చివరికి... మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కూడా ఫొటో దిగారు. చెవిరెడ్డికి మాత్రం సన్నిహితుడు. ఆయన టాలెంట్ నచ్చి కాబోలు... ఎన్నికల సమయంలో నగదు బట్వాడా బాధ్యతను అప్పగించారు. అంతెందుకు... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు కలిసి శ్రీలంకకు వెళ్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో ‘సిట్’ అధికారులు ఒకేసారి అరెస్టు చేశారు. ఆరోజున... ‘చెవిరెడ్డిని, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడిని అరెస్టు చేశారు’ అని జగన్ రోత పత్రికే పేర్కొంది. ఇప్పుడు... వెంకటేశ్ నాయుడు వేర్వేరు సందర్భాల్లో ఇతర పార్టీల నేతలతో దిగిన ఫొటోలను చూపిస్తూ ‘మీ వాడే’ అని బురద చల్లుతోంది. అసలు విషయం ఏమిటంటే... అతనికి జగన్‌తోకానీ, ముడుపుల వ్యవహారంతోకానీ సంబంధం లేదుని సూటిగా, స్పష్టంగా ఒక్కమాటా చెప్పలేక పోతోంది.
ఇది ఎవరి కోసం?
ఇది గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడు వెంకటేశ్ నాయుడు సమర్పించిన అఫిడవిట్! ఎక్కడో నంద్యాలకు చెందిన వ్యక్తి... ఒంగోలులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం ఊహించలేనిదేం కాదు! అక్కడ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీలో నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు వివిధ రకాల వెసులుబాట్ల కోసం తమ సన్నిహితులను డమ్మీ అభ్యర్థులుగా నిలబెట్టడం సహజం. చెవిరెడ్డికి వెంకటేశ్ నాయుడు సన్నిహితుడనేది నిర్వివాదాంశం. జగన్ రోత పత్రికే పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్‌లో వెంకటేశ్‌నాయుడు తన వార్షిక ఆదాయం కేవలం రూ.4.95 లక్షలుగా చూపించడం గమనార్హం.
బోత్ ఆర్ నాట్ సేమ్
‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పక్కనే నిలబడి తీగల విజయేందర్ రెడ్డి ఫొటో దిగారు కాబట్టి... ఆయనకు ‘బాగా దగ్గరేనండీ’ అంటూ జగన్ రోత పత్రిక వయ్యారాలు పోయింది. హైదరాబాద్‌లో ఒక ఆస్పత్రి ఫంక్షన్‌కు వెళ్లిన సందర్భంగా దిగిన ఫొటో ఇది. సదరు వైద్యుడి ఆహ్వానం మేరకు రాధాకృష్ణ అక్కడికి వెళ్లారు. అదే వైద్యుడు ఆహ్వానించిన చాలామందిలో తీగల విజయేందర్ రెడ్డికి కూడా ఉన్నారు. అక్కడ రాధాకృష్ణతో ఫొటో దిగారు. దీనిని పట్టుకుని రోత పత్రిక మోకాలికీ బోడిగుండుకూ ముడిపెట్టేందుకు నానా తంటాలు పడింది.
మద్యం స్కామ్ కేసు నిందితుడు, గుట్టలుగా నోట్ల కట్టల వీడియోతో దొరికిపోయిన వెంకటేశ్ నాయుడితో అప్పుడు ముఖ్యమంత్రి ‘షిక్కటి’ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటో ఇది. స్థలం... తాడేపల్లి ప్యాలెస్. సందర్భం... జగన్ నివాసంలో ఉగాది వేడుకలు! అత్యంత పరిమితంగా, బాగా దగ్గరి వారికి మాత్రమే అక్కడికి ఆహ్వానం లభించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి వెంకటేశ్ నాయుడితో జగన్ ఈ ఫొటో దిగారు. ఇలా ఒక్కసారి కాదు... పలు సందర్భాల్లో ఆయన జగన్‌ను కలిసిన చిత్రాలు ఉన్నాయి. ఎవరో మూడో వ్యక్తి ఆహ్వానం మేరకు వెళ్లిన చోట దిగిన ఫొటో వేరు, ఇక్కడ జగన్‌తో వెంకటేశ్ నాయుడు జగన్ దిగిన ఫొటో వేరు! బోత్ ఆర్ నాట్ సేమ్!