TDP Protest: శింగనమలలో టీడీపీ శ్రేణుల ధర్నా
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:51 AM
ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడి సస్పెండైన ఫీల్డ్ అసిస్టెంట్‌ను తిరిగి నియమించడంతో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి
అక్రమార్కుడిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా తీసుకోవడంపై ఆగ్రహం
బుక్కరాయసముద్రం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడి సస్పెండైన ఫీల్డ్ అసిస్టెంట్‌ను తిరిగి నియమించడంతో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. శుక్రవారం బుక్కరాయసముద్రం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించాయి. బుక్కరాయసముద్రం గ్రామ పంచాయతీలో ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండేవారు. నకిలీ జాబ్ కార్డుల తయారీ, శ్రామికుల నుంచి డబ్బులు వసూలు వంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో అధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఐదుగురిలో ఒకరైన సురేశ్‌ను అధికారులు ఇటీవల తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. సురేశ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ‘సేవ్ టీడీపీ’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తమ బంధువులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఎంపీడీవో కార్యాలయం వద్దకు వెళ్లి బైఠాయించారు. అధికారులు స్పందించకపోవడంతో పవన్ అనే టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. డ్వామా విజిలెన్స్ జిల్లా అధికారి శ్రీనివాసులు వచ్చి సురేశ్‌ను రెండ్రోజుల్లో తొలగిస్తామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు శాంతించారు.