Share News

AP Assembly Sessions: బొండా మాటల మంటలు

ABN , Publish Date - Sep 20 , 2025 | 05:08 AM

అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు కలకలం రేపాయి. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్యపై ఆయన సభలో తీవ్ర ఆరోపణలు చేశారు.

AP Assembly Sessions: బొండా మాటల మంటలు

  • పీసీబీ చైర్మన్‌పై తీవ్ర ఆరోపణలు

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ పేరూ ప్రస్తావన

  • తీవ్రంగా పరిగణించిన పవన్‌ కల్యాణ్‌

  • అప్పటికప్పుడే చైర్మన్‌, అధికారులతో భేటీ

  • బొండా ఉమాది బెదిరింపు ధోరణి.. వ్యక్తిగత ఉద్దేశాలతోనే వ్యాఖ్యలు

  • సీఎంకు నివేదించాలని పవన్‌ నిర్ణయం!

  • బొండా వ్యాఖ్యలపై సీఎంవో ఆరా

  • క్రెబ్స్‌పై తానే ఫిర్యాదు చేసిన బొండా..

  • చర్యలకు సిద్ధమయ్యాక వద్దంటూ ఒత్తిడి?

  • నేపథ్యం వివరించిన పీసీబీ అధికారులు

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు కలకలం రేపాయి. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్యపై ఆయన సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. సంబంధిత శాఖకు బాధ్యుడైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరునూ ప్రస్తావించారు. దీంతో... అసలు బొండా ఉమా ఇలా ఎందుకు వ్యవహరించారు, దీని నేపథ్యం ఏమిటనే కోణంలో అటు పవన్‌ కార్యాలయం, ఇటు సీఎంఓ కూడా ఆరా తీసింది. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్షపాత్ర పోషిస్తూ... ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుండటం నిజం. కానీ... శుక్రవారం బొండా ఉమా చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను నివ్వెర పరిచాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్‌ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఇదే అంశంపై బొండా అనుబంధ ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్‌ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ పేరును కూడా ప్రస్తావించారు. ‘‘పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా రిప్రజెంటేషన్‌ ఇవ్వడానికి చైర్మన్‌ వద్దకు వెళ్తే.. ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని, ఆయన ఆఫీసు నుంచి మాకు చెప్పాలని అంటున్నారు. ఈ విధానం సరికాదు. నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన (కృష్ణయ్య) చైర్మన్‌ సీట్లో కూర్చున్నారు. ఆయన పెద్ద పెద్దవాళ్లకు ఏవిధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదు. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ పూర్తిగా విఫలమవుతోంది.


విశాఖపట్నంలో రాంకీ పరిశ్రమ నుంచి వస్తున్న ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారని పీసీబీ చైర్మనే చెప్పారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఆ కంపెనీ యజమాని వైసీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌ పట్టించుకుని పీసీబీ అధికారులు పనిచేసే విధంగా గట్టిగా మందలించాలి’ అని బొండా అన్నారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ సభలోనే గట్టిగా, వివరంగా సమాధానమిచ్చారు.


అప్పటికప్పుడే ఆరా...

పి.కృష్ణయ్య రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా, సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది. నిబంధనలకు లోబడి పని చేస్తారు. అందుకే చంద్రబాబు అందరి కంటే ముందుగా పీసీబీ చైర్మన్‌గా ఆయన్ను నామినేటెడ్‌ పదవిలో నియమించారు. దానికి తగినట్లుగానే ఆయన పీసీబీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కృష్ణయ్య వ్యక్తిత్వం గురించి పవన్‌ కల్యాణ్‌కు పూర్తి అవగాహన ఉండడంతో.. ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు అప్పటికప్పుడు అసెంబ్లీలోని తన పేషీలో ఆయనతో భేటీ అయ్యారు. పీసీబీ అధికారులను సైతం పిలిపించారు. ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు మాట్లాడి ఉంటారో కృష్ణయ్యను ఆరా తీశారు. బొండా ఆరోపణల పూర్వాపరాలను అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై పవన్‌ సీరియస్‌ అయ్యారు. పీసీబీ చైర్మన్‌ను ఉద్దేశించి బొండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని.. వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సీఎం సృష్టం చేశారు.


ఆయనే ఫిర్యాదు చేసి..!

పీసీబీ అధికారులు బొండా తీరును పవన్‌ కల్యాణ్‌కు వివరించినట్లు తెలిసింది. ‘క్రెబ్స్‌ బయో కెమికల్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ వ్యర్థాలను భారీగా జక్కంపూడి ఏరియాలో డంప్‌ చేస్తోంది. ఇందులో కొంత బొండా నియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్‌ పరిధిలోకి వస్తుంది. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీబీకి లేఖ రాశారు. విజయవాడ పోలీసు కమిషనర్‌కూ లేఖ పంపారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలుచేయించారు. దీంతో పీసీబీ విచారణ చేయించి కంపెనీపై చర్యలకు సమాయత్తమవుతున్న తరుణంలో.. ఆయనే చర్యలు తీసుకోవద్దంటూ అధికారులపై అంతర్గతంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు’ అని వారు చెప్పినట్లు సమాచారం. బొండా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లేవనెత్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో డిప్యూటీ సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.


సీఎంవో ఆరా..

ఇంకోవైపు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌తో పీసీబీ చైర్మన్‌ కృష్ణయ్య, పీసీబీ అధికారుల చర్చలు, క్రెబ్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యవహారంలో ఎమ్యెల్యే జోక్యం.. ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆరా తీసింది. సీఎంవో అధికారులు పీసీబీ నుంచి వివరాలు తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్‌ కూడా అన్ని వివరాలనూ సీఎంవోకు అందజేశారు.

Updated Date - Sep 20 , 2025 | 05:09 AM