Nara Lokesh: పార్టీ లేకపోతే మనం లేం
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:28 AM
పార్టీ లేకపోతే మనమెవరమూ లేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. మనకు గుర్తింపు గౌరవం దక్కుతున్నాయంటే దానికి కారణం పార్టీయే.
అందరూ ఇది గుర్తుంచుకోవాలి: లోకేశ్
వైసీపీ రాక్షస పాలన ఎలా ఉందో చూశాం
గ్రామ పార్టీ అధ్యక్షుడూ రాష్ట్ర స్థాయికి ఎదగాలి
ప్రభుత్వ కార్యక్రమాలను వారి వద్దకు తీసుకెళ్లాలి
వారంలో ఒకరోజు కార్యాలయంలోనే ఉంటా
‘మై టీడీపీ’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి
మండల నేతలతో మంత్రి లోకేశ్ కాఫీ కబుర్లు
టీడీపీ శ్రేణుల శిక్షణ తరగతులు ప్రారంభం
అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘పార్టీ లేకపోతే మనమెవరమూ లేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. మనకు గుర్తింపు గౌరవం దక్కుతున్నాయంటే దానికి కారణం పార్టీయే. ఇదెవరూ విస్మరించకూడదు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ అన్నారు. గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనేది టీడీపీ సిద్ధాంతమని, పార్టీ విధానం కూడా అదేనని స్పష్టంచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన పార్టీ శిక్షణ తరగతుల్లో భాగంగా నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అనేది యూనివర్సిటీలాంటిదన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు 2012లో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారని, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంత్రి స్థాయిలో ఉన్నారని తెలిపారు. గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు.. రాష్ట్ర స్థాయి నేతలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉపముఖ్యమంత్రులుగా పనిచేయాలనేది పార్టీ సిద్ధాంతం.. విధానమని చెప్పారు. తొలిరోజు శిక్షణ తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, ఎన్.అమరనాథ్‌రెడ్డి, బెందాళం అశోక్, గౌతు శిరీష, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..
ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే..
పార్టీలో సంస్కరణల కోసం రెండేళ్లు పోరాడాను. మండల పార్టీ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా మిమ్మల్ని నియమించింది పార్టీ. ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి నియమించింది. పార్టీకి నిబద్ధతతో పనిచేయాలి. పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. పార్టీ కుటుంబంలాంటిది. చిన్న చిన్న సమస్యలు సహజం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తు.చ. తప్పకుండా ఆ నిర్ణయాలను పాటించాలి. పార్టీ నేతలు అలకవీడాలి. సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకురావాలి.
ప్రజలతో అనుబంధం పెంచుకోవాలి
ప్రజల మనసులు గెలుచుకునే విధంగా పనిచేయాలి. వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలన ఎలా ఉందో చూశాం. గతంలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 67 మంది టీడీపీ కార్యకర్తలను హత్యచేశారు. సైకో జగన్‌రెడ్డి.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. మనం సైకోతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరం ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయాలి. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జులు, కుటుంబ సాధికార సారథులతో కలిసి కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలి. అహకారం చూపితే ప్రజలు సహించరు. కష్టం లేనిదే ఫలితం రాదు. పాదయాత్ర చేయడం వల్లే ఈ స్థాయికి వచ్చాను. వారంలో ఒకరోజు కేంద్ర కార్యాలయంలోనే ఉంటాను. సమయం కేటాయిస్తాను. మీ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. ప్రతి ఒక్కరూ ‘మై టీడీపీ’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ద్వారానే పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తాం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదు. చేసే పని చెప్పుకోవాలి.
నేడు అమిత్‌షాతో భేటీ
‘మొంథా’ తుఫాను నష్టంపై కేంద్ర మంత్రులకు సమగ్ర నివేదిక
న్యూఢిల్లీ/అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యా మంత్రి లోకేశ్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన కేంద్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌తో సమావేశమవుతారు. ఇటీవల రాష్ట్రంలో ‘మొంథా’ తుఫానుతో జరిగిన పంటలు, ఇతర నష్టాల అంచనాల సమగ్ర నివేదికను వారికి అందించి.. వీలైనంత వేగంగా సాయం చేయాలని కోరనున్నారు. ఆయన వెంట రాష్ట్ర హోం మంత్రి అనిత కూడా ఉన్నారు. కాగా.. ఢిల్లీ చేరుకున్న లోకేశ్‌కు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీశ్, కేశినేని శివనాథ్, కలిశెట్టి అప్పలనాయుడు, బి.నాగరాజు, బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ తదితరులతో లోకేశ్ సమావేశమయ్యారు.
కార్యకర్తల సంతృప్తే లక్ష్యం పక్షం రోజుల్లో పార్టీ కమిటీలు: లోకేశ్
పార్టీ కార్యకర్తల సంతృప్తే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని లోకేశ్ సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో, అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కమిటీలు.. నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై చర్చించారు. కార్యకర్తల్లో అసంతృప్తి లేకుండా చూడాలని.. తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు సంబంధించిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని, పక్షం రోజుల్లో కమిటీ భర్తీ వ్యహారాన్ని కొలిక్కి తీసుకురావాలని పల్లాకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటును వేగవంతం చేయాలని, కార్యాలయాలన్నిటినీ ఒకే విధానంలో నిర్మించాలన్నారు. వీటికి బీఎ్‌సడీ ఆర్కిటెక్ట్ సంస్థ రూపొందించిన డిజైన్లను లోకేశ్ పరిశీలించారు.
పేదల సేవలో.. 120 మంది ఎమ్మెల్యేలు
ఫలితం చూపిన బాబు, లోకేశ్ సూచనలు
టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేసిన సూచనల ప్రభావం కనిపించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ‘పేదల సేవలో’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో 19 మంది మంత్రులు సహా 120 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన పింఛన్ల పంపిణీని టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలో నేతలందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు, లోకేశ్ స్పష్టంగా చెబుతున్నారు. వీరి సూచనల ప్రభావంతో సోమవారం నేతల హాజరు 90 శాతం నమోదైనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.