TDP Members : జగన్ పత్రిక కొనుగోలుకు 144 కోట్లు
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:33 AM
జగన్ పత్రికకు గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచిపెట్టిందని శాసనమండలిలో టీడీపీ సభ్యులు విరుచుకుపడ్డారు.

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జగన్ పత్రికకు గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచిపెట్టిందని శాసనమండలిలో టీడీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. 15,004 సచివాలయాలకు ఆ పేపర్ వేశారని.. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు కూడా ఆ పేపరే కొనేలా చేశారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు జగన్ పత్రిక పేపర్ కొనడానికి వీలుగా వారికి నెలకు రూ.200 చొప్పున ఆ ప్రభుత్వం అలవెన్సు ఇచ్చిందన్నారు. తద్వారా ఐదేళ్లలో ఆ పత్రిక కొనుగోలుకు రూ144.06 కోట్లను చెల్లించిందని తెలిపారు. గత ఐదేళ్లలో అన్ని వార్తాపత్రికలకు విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటనల విలువ రూ.859.3 కోట్లు కాగా.. రూ.556.82 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఇందులో జగన్ పత్రికకు ఇచ్చిన ప్రకటనల విలువ రూ.371.12 కోట్లు అని.. ఇందులో రూ.196.31 కోట్లు చెల్లించినట్లు చెప్పారు.
టీడీపీ సభ్యులు అశోక్‌బాబు, దువ్వారపు రామారావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జగన్ పత్రికకు రూ.400 కోట్లు చెల్లించారని దీనిపై విచారణకు సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కచ్చితంగా విచారణ జరుపుతామని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.