Share News

TDP: ఇక పార్టీపై ఫోకస్‌

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:24 AM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఇక నుంచి పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. వారిద్దరూ బుధవారం మధ్యాహ్నం 2.30కి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు.

TDP: ఇక పార్టీపై ఫోకస్‌

  • నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు, లోకేశ్‌

  • సంస్థాగత నిర్మాణంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో చర్చలు

  • మిగిలిన నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా దృష్టి

  • కార్యకర్తల పేర్లు పంపని ఎమ్మెల్యేలెవరో తనకు తెలియజేయాలని నిర్దేశం

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఇక నుంచి పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు. వారిద్దరూ బుధవారం మధ్యాహ్నం 2.30కి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పార్టీ కార్యకలాపాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పొలిట్‌బ్యూరో సమావేశాలకు.. పార్టీ చేపట్టే కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు మాత్రమే వీరు పార్టీ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేశ్‌.. సీఎంగా, మంత్రిగా పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాలపైనే దృష్టి సారించడంతో సంస్థాగత పదవుల భర్తీ, నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మహానాడు పూర్తయి మూడు నెలలైనా సంస్థాగత ప్రక్రియ కొలిక్కి రాకపోవడం.. అటు నామినేటెడ్‌ పదవుల భర్తీ కూడా సాగుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఒకింత అసంతృప్తి నెలకొంది. ఇది తెలిసి ఇక పార్టీపై పూరి ్తస్థాయిలో దృష్టి సారించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. మంగళవారం పల్లా శ్రీనివాసరావు, టీడీ జనార్దన్‌ తదితరులతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. ఇప్పటి వరకు క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌(సీయూబీ) స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఎన్నికల ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో ఎక్కడ ఇబ్బంది వస్తోంది.. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు, పార్టీ నేతలకు సమన్వయం లోపించిందనే సమగ్ర వివరాలు తీసుకురావాలని పల్లాను ఆదేశించినట్లు సమాచారం. దీంతోపాటు నామినేటెడ్‌ పదవుల భర్తీలో జాప్యానికి కారణాలను కూడా బుధవారం నాటి భేటీలో చంద్రబాబు చర్చించనున్నారు.


నామినేటెడ్‌ పదవుల కోసం ఇప్పటి వరకు పేర్లు పంపని ఎమ్మెల్యేలెవరో తనకు తెలియజేయాలని కూడా సూచించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం జరిగిన తీరును ఆయన సమీక్షించనున్నారు. ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులపాటు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఎమ్మెల్యేలు లేని చోట్ల ఏయే నేతలు పాలుపంచుకున్నారు.. ఎన్ని రోజులు పాల్గొన్నారనే వివరాలను కూడా తీసుకురావాలని పల్లాను కోరారు.

మూడు సార్లే పదవిపైనా చర్చ

గ్రామ, మండల స్థాయిలో వరుసగా మూడు సార్లు పదవులు చేపట్టిన వారిని ఆ పదవిలో కొనసాగించకూడదన్న నిర్ణయంపై కూడా పార్టీ నేతలతో చంద్రబాబు, లోకేశ్‌ చర్చించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా వైసీపీ హయాంలో పార్టీ కోసం పోరాడిన వారికి పదవులు దక్కకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సి వస్తే పదవులు కోల్పోయేవారికి ఇతర పదవులు తప్పనిసరిగా దక్కేలా చూడాలని, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు.


వినూత్నంగా జనంలోకి..

కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తోందని.. కానీ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెనుకబడుతున్నారని చంద్రబాబు పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసే మంచిని జనంలోకి తీసుకెళ్లేందుకు ‘మీకోసం.. మీతో’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసేందుకు టీడీపీ పెద్దలు సిద్ధమవుతున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమానికి భిన్నంగా దీనికి రూపకల్పన చేయాలన్నది వారి ఆలోచన. అదెలా ఉండాలన్న అంశంపై బుధవారం చర్చించనున్నారు. ఈ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుపైనా చంద్రబాబు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.


ఢిల్లీ బీసీ సభకు టీడీపీ మద్దతు

టీడీపీకి బీసీలే వెన్నుముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇన్‌చార్జి యలగాల నూకాలమ్మ యాదవ్‌, రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్‌ మంగళవారం అమరావతిలో సీఎంను కలిశారు. బీసీల హక్కుల సాధనకోసం ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే ఉద్యమానికి మద్దతివ్వాలని వారు సీఎంను కోరారు. మంత్రులు, ఎంపీలను కార్యక్రమానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన చంద్రబాబు.. బీసీల హక్కుల సాధనకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ వెంకట రమణరాజు, రాష్ట్ర కన్వీనర్‌ తిరుమలేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 05:29 AM