Liquor Scam: జగన్ మార్క్‌ట్రాప్
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:42 AM
ఓ నే రానికి పన్నిన కుట్రలోనూ, దాని అమలులోనూ భాగస్వాములైన వారు అప్రూవర్‌గా మారి కేసు లోగుట్టు రట్టయ్యేందుకు సహకరించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా అప్రూవర్‌గా మారిన....
ఆ ఉచ్చులో కొందరు టీడీపీ నేతలు
మద్యం స్కామ్‌లో ప్రభుత్వ వ్యూహంపై సోషల్ మీడియాలో అడ్డగోలు దాడి
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్‌కు అడ్డుచెప్పకపోవడంపై అభ్యంతరాలు
లీగల్ టీంపైనే అపవాదులు, అభాండాలు
అప్రూవర్లుగా మారాలంటే అరెస్టవడం లేదా ముందస్తు బెయిల్ రావడమనేది తప్పనిసరి
ఈ అనివార్యతకు అనుగుణంగానే సిట్ అడుగులు
వారు అప్రూవర్లుగా మారితేనే ‘లోగుట్టు’ బయటికి
అందుకే బెదరగొట్టేందుకు జగన్ కుయుక్తులు
సిట్ తన అరెస్టు దాకా రాకుండా ఎత్తులు
అవేవీ ఫలించకపోవడంతో మారిన వ్యూహం
బెయిల్‌ను వ్యతిరేకించలేదంటూ గగ్గోలు
ప్రభుత్వ వ్యూహం తెలీక గొంతు కలుపుతున్న టీడీపీ నేతలు.. ఈ రచ్చతో జగన్ ప్లాన్ ఫలించే ప్రమాదం!
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కొందరు టీడీపీ నేతలు గ్రహించలేకపోతున్నారు. మద్యం స్కాం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన మాజీ సీఎం జగన్ పన్నిన వ్యూహంలో చిక్కుకుని.. పోలీసులు, ప్రభుత్వ లీగల్ టీంపైనే అభాండాలు వేస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం బ్రాండ్ల ఆర్డర్లు, విక్రయాల్లోను.. తాడేపల్లి ప్యాలె్‌సకు ముడుపుల సొమ్మును తరలించడంలో కీలక భూమిక పోషించిన నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఉన్నతాధికారి సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్ వచ్చేందుకు సిట్, ప్రభుత్వ న్యాయవాదులే తోడ్పాటు అందిస్తున్నారని నిందలు మోపుతున్నారు. ఆ ఇద్దరూ అప్రూవర్లుగా మారడంలో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు తెలియక సోషల్ మీడియాలో జగన్ బాణీలోనే చెత్త పోస్టింగులు పెడుతున్నారు. ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఓ నే రానికి పన్నిన కుట్రలోనూ, దాని అమలులోనూ భాగస్వాములైన వారు అప్రూవర్‌గా మారి కేసు లోగుట్టు రట్టయ్యేందుకు సహకరించడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా అప్రూవర్‌గా మారిన వారి సహకారంతో కుట్ర కోణాన్ని పోలీసులు ఛేదిస్తుంటారు. నేరాల్లో భాగస్వాములైనవారు అప్రూవర్లుగా మారకూడదని, లోగుట్టు బయటపెట్టకూడదని తెరచాటు కుట్రదారులు సహజంగానే కోరుకుంటారు. రూ.3,500 కోట్ల విలువ చేసే ఏపీ మద్యం కుంభకోణం కేసు కూడా ఈ కోవకు చెందినదే.
లిక్కర్ ముడుపుల దందాలో మూలవిరాట్ ఎవరంటే అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలె్‌సవైపే చూపుతున్నాయి. మాజీ సీఎం జగన్ పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జిషీట్లోనూ ప్రస్తావించింది. అసలు సూత్రధారి ప్రమేయంపై పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభించాలంటే.. మద్యం స్కాంలో ఆది నుంచీ చివరి వరకు పనిచేసిన ఉన్నతాధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ మరిన్ని విషయాలు బయటపెట్టాలి. దర్యాప్తు బృందానికి వారు సహకరించాలి. అలా సహకరించాలంటే తమను అరెస్టు చేయకూడదని.. జైల్లో పెట్టకూడదని వారు కోరుకోవడం సహజమే. వారిని కూడా మిగతా నిందితుల మాదిరిగానే జైల్లో నిర్బంధిస్తే కేసు ముందుకు సాగదు. వాస్తవానికి ఒక కేసులో ఎవరైనా అప్రూవర్‌గా మారాలంటే అప్పటికే అరెస్టు అయి ఉండటం.. లేదా వారికి ముందస్తు బెయిల్ వచ్చి ఉండటం అనేది న్యాయపరమైన ఆవశ్యకత. దీనిని దృష్టిలో ఉంచుకునే ఇటు పోలీసులు, అటు ప్రభుత్వ న్యాయవాద బృందం నిర్దిష్టమైన వ్యూహప్రతివ్యూహాలు అనుసరిస్తుంటాయి. అవన్నీ నలుగురికీ చెప్పిచేసేవి కావు. అసలు కుట్రదారును కలుగులో నుంచి బయటకు తీసుకొచ్చేదాకా ఆ వ్యూహాలను బహిర్గతం చేయరు. కానీ వాటిని ముందుగానే గ్రహించి ప్రత్యర్థులను దెబ్బతీయడంలో జగన్‌ది అందెవేసిన చెయ్యి. అక్రమాస్తుల కేసు నుంచి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వరకు ఇదే కనబడుతోంది. ఇప్పుడు మద్యం స్కాంలో కూడా తన పేరు బయటకు రాకుండా, తన అరెస్టుకు దారితీయకుండా తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ను అప్రూవర్లుగా మార్చుకునేందుకు సిట్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఆయన పావులు కదుపుతున్నారు. ఆ అధికారులిద్దరిపైనా ఒత్తిడి తేవడం ఒక ఎత్తయితే.. దర్యాప్తు సంస్థను, ప్రభుత్వ లీగల్ టీంను తప్పుదారి పట్టించడం మరో ఎత్తు. జగన్ ఇలాంటివాటిలో ఆరితేరారు. ఈ లోగుట్టు తెలియక.. ప్రభుత్వం, పోలీసులు, లీగల్ టీం.. ఆ ఇద్దరు అధికారుల ముందస్తు బెయిల్‌కు సహకరిస్తున్నారంటూ టీడీపీకే చెందిన కొందరు నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
ఏకంగా అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివా్‌సను టార్గెట్ చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఏసీబీ కోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి 18న తీర్పు వెలువరించనున్నారు. ముందస్తు బెయిల్‌కు సిట్, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలుపలేదు. వారిని అప్రూవర్లుగా మార్చుకోవడానికి ఇది ఉపకరిస్తుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది తెలియకో.. జగన్ ప్రభావానికి లోనయ్యో.. కొందరు టీడీపీ నేతలు.. సిట్, న్యాయవాదులకు వ్యతిరేకంగా అడ్డగోలు పోస్టింగులు పెడుతున్నారు. దీంతో ఇదెక్కడి తలనొప్పి అంటూ వారు నిట్టూరుస్తున్నారు. జగన్ కోరుకుంటున్నదీ ఇదే.
వారు నోరు విప్పకూడదు!!
నిజానికి లిక్కర్ కేసులో కీలక నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లను సిట్ ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. కానీ అనేక దఫాలు పిలిచి విచారణ జరిపింది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే కేసులో ఇంత పురోగతి సాధించింది. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహా 12 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రమేయం.. గత ఎన్నికల్లో లిక్కర్ ముడుపుల సొమ్ము ఖర్చు పెట్టడం, లంచాల సొమ్ముతో భారీగా బంగారం కొనుగోలు చేయడం.. ఇంకా దేశవిదేశాల్లో మైనింగ్ వ్యాపారాల నిర్వహణ వంటి అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. నానాటికీ ఈ కేసు పెద్దదవుతుండడంతో తాము అప్రూవర్లుగా మారితే శిక్ష తగ్గవచ్చని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనుకున్నారు. ఆ మేరకు న్యాయపరమైన ప్రక్రియ ముగించేందుకు వారు సిద్ధమయ్యారు. అప్పటికే విచారణలో జగన్ పేరు చెప్పొద్దని వారికి బెదిరింపులు వెళ్లాయి. సిట్‌కు సహకరించవద్దని, తమతో అబద్ధాలు చెప్పిస్తున్నారని కోర్టులో వెల్లడించాలని కూడా ఒత్తిళ్లు తెచ్చారు. అవేవీ ఫలించకపోవడంతో, వారి ముందస్తు బెయిల్‌ను సిట్ అభ్యంతరపెట్టకపోవడంపై టీడీపీ వారే ఆరోపణలు చేసేలా చేసి కేసు తన మెడకు చుట్టుకోకుండా చూసుకునే కుతంత్రానికి జగన్ తెర తీశారు.
టీడీపీ నేతలే ఎందుకు..?
లిక్కర్ కేసులో ఆ ఇద్దరు అధికారులకు సిట్, లీగల్ టీం సహకరిస్తున్నాయని వైసీపీ, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఆరోపణలు చేస్తే విలువ ఉండదు. ఎవరూ పెద్దగా పట్టించుకోరు కూడా. అవే ఆరోపణలు అధికార పార్టీ నేతలతో చేయిస్తే..? సోషల్ మీడియా వేదికగా డిబేట్లు పెట్టి అల్లరి చేయిస్తే..? దర్యాప్తు అధికారులు, లీగల్ బృందంపై విమర్శలు చేయిస్తే..? కేసు పక్కదారి పడుతుంది. అసలు విషయం పక్కకు వెళ్లి, కొసరు విషయాలపైనే చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో లిక్కర్ కేసులో మూలవిరాట్.. అరెస్టు తన దాకా రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఇప్పుడు అచ్చం ఇదే జరుగుతోందని అధికార వర్గాలు అంటున్నాయి. జగన్ వ్యూహాత్మకంగా టీడీపీ నేతలను ట్రాప్ చేశారని చెబుతున్నాయి.
వివేకా కేసులో అలా..
మద్యం కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన.. సిట్, ప్రభుత్వ న్యాయవాదులు వారికి సహకరిస్తున్నాయని అనుకోవడం సముచితం కాదని అధికార వర్గాలు అంటున్నాయి. ఒక్కసారి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరిగిందో తెలుసుకుంటే అసలు విషయం బోధపడుతుందని చెబుతున్నాయి. ఆ కేసులో దస్తగిరి (ఏ-4) కీలక నిందితుడు. అత డిని సీబీఐ అరెస్టు చేసినప్పుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అదే సమయంలో అప్రూవర్‌గా మారతానని సీబీఐకి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడి బెయిల్‌కు దర్యాప్తు సంస్థ అడ్డుచెప్పలేదు. ఇదే కేసులో ఉన్న ఇతర నిందితులు గంగిరెడ్డి, మరి కొందరు అభ్యంతరం తెలిపారు. దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించొద్దని కోరుతూనే.. సీబీఐపై అనేక తీవ్ర ఆరోపణలు చేశారు. దస్తగిరి అప్రూవర్ పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తోసిపుచ్చారు. ‘దస్తగిరి అప్రూవర్‌గా మారితే కేసు విచారణకు ఉపకరిస్తుందని సీబీఐ చెబుతోంది. జరిగిన నేరం(వివేకా హత్య)లో ఎవరి పాత్ర ఏమిటో దర్యాప్తు సంస్థ మరింత సవివరంగా కనిపెట్టగలదు. నిర్ధారించగలదు. సాక్ష్యాధారాలు సేకరించి కోర్టు ముందు ఉంచగలదు. అప్రూవర్‌గా మారినంత మాత్రాన అతడితో సీబీఐ కుమ్మక్కయినట్లు భావించడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కోర్టు అనుమతించింది. అతడికి బెయిల్ కూడా వచ్చింది. ఇక దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాక అనేక బెదిరింపులు, హెచ్చరికలు ఎదురయ్యాయి. అతడిపై దాడి చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. తప్పుడు కేసులో జైలుకు కూడా పంపారు. తనకు రక్షణ కల్పించాలని కడప ఎస్పీని అనేక సందర్భాల్లో దస్తగిరి కోరాడు.
లిక్కర్ కేసులో ఇలా..
మద్యం కేసులో అక్రమార్కులకు ఆసాంతం సహకరించిన అధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్. ముడుపుల పాలసీ రూపకల్పన కోసం ఎంపీ మిథున్‌రెడ్డి నిర్వహించిన తొలి సమావేశంలో పాల్గొనడం నుంచి ముడుపుల దందాను గత ఏడాది మే నెల వరకు అప్రతిహతంగా అమలు చేయడంలో అధికారులుగా వారి పాత్ర ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కాంలో కేసు నమోదైంది. తొలుత వాసుదేవరెడ్డి, తర్వాత సత్యప్రసాద్‌ను సిట్ విచారించింది. వారు కీలక విషయాలు వెల్లడించిన తర్వాతే.. జగన్ ప్రభుత్వంలో లిక్కర్ మాఫియాను ఎలా నడిపించారు? ఎన్ని వేల కోట్లు దారి మళ్లించారో సిట్ కనిపెట్టగలిగింది. శిక్ష తప్పించుకోవడానికి ఇప్పుడు వారిద్దరూ అప్రూవర్లుగా మారడానికి ముందుకొచ్చారు. అదే సమయంలో ముందస్తు బెయుల్ కోరుకుంటున్నారు. అయితే మిగతా నిందితుల మాదిరిగానే వీరిని కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఈ స్కాంలోని తెరవెనుక సూత్రధారులు కోరుకుంటున్నారు. అదే జరిగితే వారు అప్రూవర్లుగా మారరని, తమతోనే ఉంటారన్నది వారి ఆలోచన. కానీ వారికి ముందస్తు బెయిల్ రావడానికి సహకరించి.. ఆనక అప్రూవర్ పిటిషన్లు వేయించాలన్నది ప్రభుత్వ లీగల్ బృందం భావన. చట్టపరంగా ఈ సాంకేతిక కోణం గురించి తెలియక కొందరు టీడీపీ నేతలు జగన్ విసిరిన వలలో చిక్కుకున్నారు. నిందితుల ముందస్తు బెయిల్‌కు సహకరిస్తున్నారంటూ అడ్డగోలు పోస్టులు పెడుతూ సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. పరోక్షంగా జగన్‌కు సహకరిస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి.