Share News

Chandrababu Political Career: 15 ఏళ్లు సీఎంగా.. 47 ఏళ్లు ఎమ్మెల్యేగా

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:35 AM

సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి శనివారం(మార్చి 15)తో 47 ఏళ్లు పూర్తయ్యాయు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో...

Chandrababu Political Career: 15 ఏళ్లు సీఎంగా.. 47 ఏళ్లు ఎమ్మెల్యేగా

  • ఆ ఘనత చంద్రబాబుదే!

  • అభివృద్ధి.. సంక్షేమానికి ఆయనే చిరునామా

  • బీటీ నాయుడు, అశోక్‌బాబు,టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాల్యాద్రి వ్యాఖ్యలు

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి సంక్షేమానికి చిరునామా సీఎం చంద్రబాబు అని, ప్రజానాయకుడిగా ప్రజల మనసులను గెలవగలిగారు కాబట్టే 47 ఏళ్ల సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో కొనసాగారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి శనివారం(మార్చి 15)తో 47 ఏళ్లు పూర్తయ్యాయు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బీటీ నాయుడు, అశోక్‌బాబు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌ చైర్మన్‌ గురజాల మాల్యాద్రి, పార్టీ అధికార ప్రతినిధి పాతర్ల రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 47 ఏళ్ల క్రితం 1978 మార్చి 15న ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారని, అప్పటి నుంచి రాజకీయాల్లో మచ్చలేని నేతగా కొనసాగుతున్నారని వర్ల రామయ్య అన్నారు. ప్రజ మనసులో ప్రత్యేక స్థానం దక్కించుకోవడం వల్లే ఇనేళ్లుగా ఆయన రాజకీయాల్లో మనగలుగుతున్నారని తెలిపారు. ‘‘చంద్రబాబు ఓ విజనరీ. రాష్ట్ర యువత భవిత కోసం అమెరికా వీధుల్లో తిరిగి హైదరాబాద్‌కు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చేలా చేశారు. దాని ఫలితమే నేడు సైబరాబాద్‌లో 30 లక్షల మందికిపైగా యువత ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం ఎస్సీ, బీసీ, మైనారిటీ, రైతు బిడ్డలే’’ అని అన్నారు. బీటీ నాయుడు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ఏకంగా 47 ఏళ్లు రాజకీయాల్లో మనగలగడం ప్రపంచ రికార్డుగా పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది అభివృద్ధి మాత్రమేనని, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి వేలాది ఎకరాలు సేకరించడం చంద్రబాబుకే సాధ్యమైందని కొనియాడారు. సామాజిక న్యాయానికి చంద్రబాబు ‘ఐకాన్‌’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని, దానికి నిదర్శనమే విద్యుత్తు సంస్కరణలని పేర్కొన్నారు.


నేడు దేశమంతా విద్యుత్తు సంస్కరణ మంత్రాన్ని జపిస్తోందన్నారు. 5 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నుంచి 20 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చామంటే అది చంద్రబాబు ఘనతేనని తెలిపారు. గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ.. ఇంత వరకు రాష్ట్రంలో 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే 15 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఒక్క చంద్రబాబేనని తెలిపారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం వల్లే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన మంచి ఏమిటో ఆయన జైలుకు వెళ్లిన సమయంలో ప్రజలు ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. అదే జగన్‌ని అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెడితే ఒక్కరు కూడా నిరసన తెలిపిన దాఖలాల్లేవన్నారు. పాతర్ల రమేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌ పాలన అరాచకానికి కేరాఫ్‌ అయితే చంద్రబాబు పాలన అభివృద్ధికి చిరునామా అని పేర్కొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 03:35 AM