Anantapuram District: రెవెన్యూ అధికారులపై టీడీపీ నేతల దాడి
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:42 AM
ఎర్రమట్టి తరలింపును అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలోని సింగరప్ప కొండ వద్ద అనుమతులు లేకుండా...
మట్టి తరలింపును అడ్డుకున్నారనే..!
గార్లదిన్నె, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఎర్రమట్టి తరలింపును అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలోని సింగరప్ప కొండ వద్ద అనుమతులు లేకుండా యంత్రాల ద్వారా ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎర్రమట్టి తరలింపును అడ్డుకుని, చర్యలు తీసుకోవాలని సిబ్బందిని వారు ఆదేశించారు. దీంతో కల్లూరు వీఆర్వో రవికాంత్, వీఆర్‌ఏ నాగరాజు గురువారం (7న) రాత్రి సింగరప్ప కొండ వద్దకెళ్లారు. మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని వాటి తాళాలు లాక్కున్నారు. విషయం తెలుసుకున్న కల్లూరు టీడీపీ నాయకులు మధు, రామాంజి, నరసింహ, శేషయ్య, వీరేశ్ వచ్చి.. వీఆర్వో, వీఆర్‌ఏతో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్ బాషా సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి సంబంధించి ఐదుగురిపై శుక్రవారం రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.