TDP Leaders: దేశాన్ని జగన్ అవమానించారు
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:07 AM
స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారాన్ని తెలియజేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి లేని వ్యక్తి: ఎంపీ కలిశెట్టి
ఫ్రస్టేషన్‌లో ఉంటే జాతీయ పండుగను మర్చిపోతారా: సోమిరెడ్డి
జెండా ఎగురవేయని మాజీ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు: ధూళిపాళ్ల
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారాన్ని తెలియజేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడారు. ‘జగన్‌కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవు. మాజీ సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఉండి స్వాతంత్య్రదినోత్సవం నాడు జెండా ఆవిష్కరణ చేయకపోవడం ద్వారా దేశాన్ని అవమానించారు’ అని ఎంపీ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటాడుతూ... ‘లక్షల మంది ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్య్ర సాధించిన రోజు కూడా మీకు గుర్తు లేదా? ఒక పార్టీ అధ్యక్షుడివని, మాజీ సీఎంవి అనే విషయమైనా గుర్తుందా? పులివెందుల జెడ్పీటీసీ ఫలితంతో ఫ్రస్టేషన్‌లో ఉంటే మాత్రం జాతీయ పండుగను మర్చిపోతే ఎలా?’ అంటూ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రదినోత్సవం రోజున జెండా ఎగురవేయని మాజీ సీఎంగా వైఎస్ జగన్ నిలిచిపోతారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జెండా ఎగురవేయకపోవడం... దేశాన్ని, స్వాతంత్రం కోసం పోరాడిన వారిని, జాతీయ జెండాను అవమానించడమేనని మండిపడ్డారు.
జగన్ పంద్రాగస్టు వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదు?: కొండపల్లి
‘ప్రతిఒక్కరూ ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటారు. కానీ ఐదేళ్లు సీఎం పదవిని అనుభవించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం వేడుకల్లో ఎందుకు పాల్గొనలేకపోయారో చెప్పాలి’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో కోట్లామంది ప్రజలు పంద్రాగస్టును పండగ లా జరుపుకుంటారు. జగన్ మాత్రం ఎక్కడా ఉత్సావాల్లో పాల్గొన్నట్లు దాఖలాలు లేవు. దీన్ని ఎమంటారో వైసీసీ నేతలే చెప్పాలి. బహుశా మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు సర్వీసు, పులివెందుల, ఒంటిమిట్ట జడ్‌పీటీసీ స్థానాల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతుకావటం వల్ల ఆయన ఫ్రస్టేషన్‌లోకి వెళ్లినట్లు ఉంది. ఉత్తరాంధ్ర మీద అభిమానమున్న ఏకైక సీఎం చంద్రబాబే. అందుకే తోటపల్లి ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న నామకరణం చేశారు’ అని అన్నారు.