Lavu Sri krishna Devarayalu: పొగాకు రైతులను కేంద్రం ఆదుకోవాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:42 AM
రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు
న్యూఢిల్లీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. పొగాకు రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. పొగాకు రైతులకు మద్దతు అందించకపోతే కొనుగోళ్లు మరింత తగ్గి వేలాది కుటుంబాల్లో సంక్షోభం తప్పదని అన్నారు. లోక్‌సభలో సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025పై బుధవారం జరిగిన చర్చ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. కాగా, దేశంలోని అతిపెద్ద పొగాకు సంస్థల్లో ఒకటైన ఐటీసీ లిమిటెడ్‌పై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీసీ, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.5,187 కోట్ల నికర లాభాన్ని నివేదించినప్పటికీ, తమకు సరుకు అందిస్తున్న రైతుల సంక్షేమం, ప్రత్యామ్నాయ పంటలు లేదా వారి ఆర్థిక స్థిరత్వం కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను సరైన రీతిలో వినియోగించడం లేదని ఆరోపించారు.