TDP Leader Makkena Ankaiah Chowdhury: నా హత్యకు పెద్దిరెడ్డి కుట్ర
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:05 AM
పెద్దిరెడ్డి కుటుంబం నన్ను చంపాలని చూసింది. నాపై దాడి, కిడ్నాప్ విషయం టీవీల్లో రావడంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు.ఎస్పీతో మాట్లాడారు.
నెల్లూరు టీడీపీ నేత అంకయ్యచౌదరి ఆరోపణ
రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, ద్వారకానాథరెడ్డిపై ఫిర్యాదు
ములకలచెరువు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘పెద్దిరెడ్డి కుటుంబం నన్ను చంపాలని చూసింది. నాపై దాడి, కిడ్నాప్ విషయం టీవీల్లో రావడంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు.ఎస్పీతో మాట్లాడారు.దాంతో నేను ప్రాణాలతో బయటపడ్డా’ అని నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిశీలకుడు మక్కెన అంకయ్య చౌదరి పేర్కొన్నారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డితో కలసి ఎస్‌ఐ నరసింహుడుకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో పాటు వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.అంతకుముందు విలేకరుల సమావేశంలో అంకయ్యచౌదరి మాట్లాడారు. ‘2023లో జరిగిన పట్టభద్రుల తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ సూచనలతో పార్టీ అవసరాల కోసం స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేశా. 2023 మార్చి 13న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు వచ్చా.అనంతరం కురబలకోట, పెద్దమండ్యం మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లా.
గుర్తింపు కార్డులు లేకుండా ఓట్లు ఎలా వేయిస్తున్నారని పోలింగ్ అధికారులను ప్రశ్నించి, దొంగఓట్లు వేయకుండా అడ్డుకున్నా. అక్కడి నుంచి బయలుదేరుతుండగా వైసీపీ నాయకులు దాడిచేశారు. టీడీపీ నాయకులు, పోలీసులు రక్షించి కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపారు. తంబళ్లపల్లె దాటక ముందే 10 నుంచి 15 కార్లలో వైసీపీ నాయకులు వెంబడించారు. ముదివేడు క్రాస్‌కు వచ్చేసరికి కార్లు అడ్డుపెట్టి నా కారును ధ్వంసం చేశారు. సెల్‌ఫోన్లు, ఉంగరాలు లాక్కుని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. పెద్దిరెడ్డి కుటుంబం నన్ను చంపేయమని చెప్పినట్లు వైసీపీ నాయకులు చెప్పారు. ఈ ఘటన గురించి టీవీల్లో రావడంతో చంద్రబాబు జోక్యం చేసుకుని ఎస్పీతో మాట్లాడారు. దాంతో బయటపడ్డా’అని అంకయ్య చౌదరి వివరించారు.