Share News

TDP Leader: బూతులు తిట్టి.. చెంప పగలగొట్టి

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:12 AM

విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌పై ఓ టీడీపీ నాయకుడు బూతులతో రెచ్చిపోవడమే కాకుండా చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో చోటుచేసుకుంది. సదరు నేత మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి...

TDP Leader: బూతులు తిట్టి.. చెంప పగలగొట్టి

  • ఏఆర్‌ కానిస్టేబుల్‌పై టీడీపీ నాయకుడి దాడి

  • సదరు నేత మంత్రి జనార్దన్‌ రెడ్డి బంధువు

  • తీవ్రంగా ఖండించిన మంత్రి బీసీ

కొలిమిగుండ్ల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌పై ఓ టీడీపీ నాయకుడు బూతులతో రెచ్చిపోవడమే కాకుండా చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో చోటుచేసుకుంది. సదరు నేత మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమీప బంధువు కావడం గమనార్హం. దాడి ఘటన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకెళితే... కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్టోత్సవాలు బుధవారం జరిగాయి. ఈ వేడుకలకు దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రులు ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా.. బయట టీడీపీ నాయకుడు, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమీప బంధువు (వరుసకు సోదరుడు) బీసీ మదన భూపాల్‌రెడ్డి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా కారణాలు, ప్రొటోకాల్‌ దృష్ట్యా ఆయన్ను లోపలికి పంపేందుకు పోలీసులు నిరాకరించారు. లోపల రద్దీ ఉందని, మంత్రులు వచ్చాక పంపుతామని చెప్పినా భూపాల్‌ రెడ్డి వినలేదు. ఈ సమయంలో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. విధుల్లో ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ జశ్వంత్‌కుమార్‌పై భూపాల్‌ రెడ్డి పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. మరింత ఆగ్రహానికి లోనై ఆ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. కాగా, కానిస్టేబుల్‌ జశ్వంత్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ రమే్‌షబాబు వెల్లడించారు.

ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందే: మంత్రి బీసీ

కానిస్టేబుల్‌పై దాడి ఘటనను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఖండించారు. ప్రజాప్రభుత్వ పాలనలో ఇలాంటి ఘటనలకు తావులేదన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి తన తమ్ముడైనా, మరెవరైనా సరే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 05:13 AM