TDP Presidents List: కొలిక్కివచ్చిన కసరత్తు
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:25 AM
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల నియామకం దాదాపు కొలిక్కి వచ్చింది.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల జాబితా సిద్ధం
రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన
నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి బాధ్యతలు
10 మంది ఓసీలు, 9 మంది బీసీలకు అవకాశం
నలుగురు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి చాన్స్
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల నియామకం దాదాపు కొలిక్కి వచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు మంగళవారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు మంత్రులు, సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. పల్లా సిద్ధం చేసిన జాబితాను పరిశీలించారు. కూర్పు బాగుందని, మరొక్కసారి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకుని రెండు, మూడు రోజుల్లో తుది జాబితా ఖరారు చేద్దామని పేర్కొన్నారు. మంగళవారం సిద్ధం చేసిన జాబితా ప్రకారం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల్లో సీనియర్లతో పాటు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం కల్పించారు. సుమారు 10 మంది సీనియర్లకు అవకాశం దక్కింది. ఈ జాబితాలో పదిమంది ఓసీలు, 9మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి అవకాశం లభించనుంది. ఓసీల్లో నలుగురు కమ్మ, ముగ్గురు కాపులు, ఇద్దరు రెడ్లు, ఒక రాజు ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వారిలో బడేటి రాధాకృష్ణ, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంఎస్ రాజు, కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేలు కాగా, బీద రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్సీ. పిల్లి మాణిక్యాలరావు (లిడ్‌క్యాప్ చైర్మన్), వీరంకి గురుమూర్తి (గౌడ కార్పొరేషన్ చైర్మన్,), కోట్ని బాలాజీ (డీసీఎంస్ చైర్మన్), బొడ్డు వెంకట రమణ చౌదరి (రాజమండ్రి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్), మంతెన రామరాజు (ఏపీఐఐసీ చైర్మన్), సలగల రాజశేఖర్ (బాపట్ల అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్), మన్నే సుబ్బారెడ్డి (విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్) నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు.
సీనియార్టీ.. విధేయతకు ప్రాధాన్యం
రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్న సుగవాసి ప్రసాద్ తొలినుంచీ టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయన సోదరుడు సుగవాసి సుబ్రహ్మణ్యానికి 2024లో రాజంపేట ఎమ్మెల్యేగా టీడీపీ అవకాశం ఇచ్చింది. ఆయన ఓటమి పాలై ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రసాద్ మాత్రం పదవులతో సంబంధం లేకుండా పార్టీనే నమ్ముకుని ఉన్నారు. సీనియార్టీ, విధేయత, సామాజిక సమీకరణాలు కలిసి రావడంతో ఆయన్ను పదవి వరించింది.
కడప పార్లమెంటు అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్న భూపేశ్ సుబ్బరామిరెడ్డి.. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. 2024 ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి, షర్మిలపై టీడీపీ తరఫున పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. 2019లో 3.77 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిన అవినాశ్‌ను 2024 ఎన్నికల్లో 62వేల మెజార్టీకి పరిమితం చేశారు.
నంద్యాల పార్లమెంటు అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్న మన్నే సుబ్బారెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా చేశారు. 2024 ఎన్నికల్లో డోన్ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించారు. చివరి నిమిషంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సుబ్బారెడ్డికి అవకాశం దక్కలేదు.
శ్రీకాకుళం పార్లమెంటు అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్న మొదలవలస రమేశ్ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని నేతలందరితో కలుపుగోలుగా ఉండటం, సీనియార్టీ ఆయనకు కలిసి వచ్చింది.
విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్న కిమిడి నాగార్జున మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకురాలు కిమిడి మృణాళిని తనయుడు. ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నాయకుడు కిమిడి కళావెంకట్రావు సోదరుడి కుమారుడు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణపై గట్టిగా పోరాడటం నాగార్జునకు కలిసి వచ్చింది.
మంతెన రామరాజు ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. రఘురామరాజు కోసం సీటు త్యాగం చేశారు.
వీరిపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి
అరకు పార్లమెంటు అధ్యక్షురాలిగా పరిశీలనలో ఉన్న తేజోవతి.. పార్టీ నేతలందరినీ కలుపుకొనిపోరని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గోరని శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చాలామంది టీడీపీ నాయకులకు అసలు షణ్ముగం రెడ్డి పేరే తెలియదని, అలాంటి వ్యక్తికి సామాజిక సమీకరణల్లో భాగంగా అధ్యక్ష పదవి ఇవ్వడం సమంజసం కాదనే వాదన ఉంది. కర్నూలులో మైనార్టీ కోటాలో తెరపైకి వచ్చిన షేక్ వహీద్ హుస్సేన్ విషయంలోనూ అసంతృప్తి ఉంది. అమలాపురం అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉన్న గుత్తుల సాయి వివాదారహితుడైనా.. పార్టీని ఎంత వరకు నడుపుతారనేది అనుమానమేనని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనకాపల్లి నుంచి కోట్ని బాలాజీకి జిల్లా స్థాయిలో అందరు నేతలను కలుపుకొని వెళ్లే సత్తా లేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. లోకేశ్‌కు సన్నిహితంగా ఉండటం ఆయనకు కలిసొచ్చింది. విశాఖ అధ్యక్షుడిగా పరిశీలనలో ఉన్న చోడే వెంకట పట్టాభిరామ్ సీనియర్ అయినా పార్టీ శ్రేణుల్లో సానుకూలత లేదు.