Share News

Party Cadre Delay: పార్టీ అధ్యక్షా.. పదవులెక్కడ

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:17 AM

జగన్‌ జమానాలో ఐదేళ్లూ అష్టకష్టాలు పడ్డాం! ఇప్పుడు అధికారంలోకి వచ్చాం! ఏదో ఒక పదవి దక్కకపోతుందా?’ అని ఎదురు చూస్తున్న టీడీపీ కిందిస్థాయి నేతలకు నిరాశే మిగులుతోంది.

Party Cadre Delay: పార్టీ అధ్యక్షా.. పదవులెక్కడ

  • అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కొలిక్కిరాని నామినేటెడ్‌ భర్తీ

  • సంస్థాగత పదవుల్లోనూ అదే జాప్యం

  • నామినేటెడ్‌కు పేర్లు ఇవ్వని ఎమ్మెల్యేలు

  • ఐవీఆర్‌ఎస్‌కే ప్రాధాన్యంపై కినుక

  • పార్టీ పదవుల భర్తీలో అనేక సమస్యలు

  • ఎన్నికల కమిటీ వేసినా ఫలితం శూన్యం

  • పాలనలో చంద్రబాబు, లోకేశ్‌ బిజీ

  • కార్యాలయానికి సీనియర్లూ దూరం

  • సమన్వయ భారమంతా పల్లాపైనే

పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోతున్నా ఇప్పటికీ ప్రధాన కార్పొరేషన్లు, అధిక శాతం దేవాలయ కమిటీలను నియమించుకోలేకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అధిష్ఠానం పెట్టిన నిబంధనలు, పార్టీకోసం పనిచేసిన వారిని కాదని తమకు నచ్చిన వారిపై ఎమ్మెల్యేలు మొగ్గు చూపడం, పేర్లపై తెగని పంచాయితీలు... ఇలా పలు కారణాలతో సంస్థాగత పదవుల భర్తీ కూడా కొలిక్కి రావడంలేదు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘జగన్‌ జమానాలో ఐదేళ్లూ అష్టకష్టాలు పడ్డాం! ఇప్పుడు అధికారంలోకి వచ్చాం! ఏదో ఒక పదవి దక్కకపోతుందా?’ అని ఎదురు చూస్తున్న టీడీపీ కిందిస్థాయి నేతలకు నిరాశే మిగులుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా... నామినేటెడ్‌ పదవుల భర్తీ కొలిక్కిరాలేదు. ఇక... సంస్థాగత పదవులపైనా కసరత్తు పూర్తి కాలేదు. ఈ పరిస్థితి టీడీపీ శ్రేణుల్లో ఒకరకమైన నిరాశకు, అసంతృప్తికి దారి తీస్తోంది. అధికారం చేతిలో ఉండీ, నామినేటెడ్‌ పదవులు ఇచ్చే అవకాశమూ ఉండీ... ఎందుకీ తాత్సారం? అనే ప్రశ్నకు భిన్న సమాధానాలు లభిస్తున్నాయి. ఈ జాప్యానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలే అని కొందరు చెబుతుండగా... తాము పేర్లు పంపి ప్రయోజనం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నామినేటెడ్‌ పోస్టులకు పేర్లు పంపాలని టీడీపీ అధిష్ఠానం కొన్ని నెలలుగా కోరుతోంది. కానీ ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు పేర్లు పంపలేదు. ‘‘మేం ఎవరి పేరు ఇచ్చినా చివరకు ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా ఇంకెవరినో ఎంపిక చేస్తారు. ఆ మాత్రం దానికి పేర్లు ఇవ్వడం ఎందుకు?’’ అని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు.. స్థానికంగా నేతల మధ్య పంచాయితీలు తేలకపోవడంతో పేర్లు పంపడం లేదు. ఈ కారణంగా పీఏసీఎ్‌సల్లో ఇంకా 13 శాతం, ఏఎంసీల్లో 20 శాతం, దేవాలయ కమిటీల్లో 50 శాతం పదవులు భర్తీ కాలేదు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్‌ పదవుల భర్తీ పూర్తి చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్టున్నట్లు తెలుస్తోంది.


పార్టీ పదవుల్లోనూ జాప్యమే

పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు టీడీపీ అధిష్ఠానం ఈ ఏడాది ఏప్రిల్‌లో కమిటీని నియమించింది. ఇందులో వర్ల రామయ్య అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్‌, మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, సవిత, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సభ్యులుగా ఉన్నారు. సాధారణంగా మహానాడు నాటికే సంస్థాగత కసరత్తు పూర్తి చేసి రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంటుంది. పార్టీ అధినేత చంద్రబాబు కూడా చాలాసార్లు మే 15 నాటికి సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో నాయకుల నడుమ సమన్వయ లోపంతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.


భజనచేసే వారికి అందలం?

పనిచేసిన వారికే పదవులివ్వాలన్న చంద్రబాబు ఆదేశాలను చాలా మంది ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. ఎన్నికల అనంతరం తమ చుట్టూ తిరిగి భజన చేస్తున్నవారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. ఎన్నికల్లో పనిచేసిన వారికి కాకుండా మండల పార్టీ అధ్యక్ష పదవులను ఏకంగా తన బంధువర్గానికి కట్టబెట్టారు. దీనిపై స్థానికంగా పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌(సీయూబీ) స్థాయిలో సంస్థాగత ప్రక్రియ పూర్తయినా.. గ్రామ, మండల స్థాయికి వచ్చేసరికి పేర్ల పంచాయతీ నడుస్తోంది. దీంతో ఈ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్న చందంగా తయారైంది. గ్రామ, మండల స్థాయిలో వరుసగా మూడు సార్లు ఆ పదవి చేసిన వారిని ఆ పదవిలో కొనసాగించకూడదన్న నిర్ణయం కూడా పదవుల భర్తీపై ప్రభావం చూపుతోంది. ఈ నిర్ణయం ప్రకారం ఆరేళ్లు గ్రామ, మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారు ఆ పదవిలో కొనసాగకూడదు. అంతకన్నా పెద్ద పదవిలో గానీ.. దానికి సమాంతరమైన పదవిలో గానీ వారిని నియమించాలి. అయితే గత ఐదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో అధికార వైసీపీతో పోరాడిన వారికి ఇప్పుడు పదవులు దక్కవు. మండల పార్టీ అధ్యక్ష పదవి కన్నా పెద్ద పదవి ఇవ్వాలని చెబుతున్నా.. అది కార్యరూపం దాల్చదు. దీంతో ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వారికి ఇప్పుడు పదవులు ఎండమావేనన్న ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామ, మండల స్థాయిలో సంస్థాగత ప్రక్రియను ముగించుకుని, అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో కమిటీలను నియమించుకుంటే తప్ప రాష్ట్ర స్థాయి కమిటీ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాదు. సంస్థాగత ఎన్నికల నిర్వహణ కమిటీ కసరత్తు చేస్తున్నా ఎమ్మెల్యేల సహాయ నిరాకరణతోపాటు పలు కారణాలతో ఆలస్యమవుతోంది.


ఎందుకీ పరిస్థితి..?

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలపైనే దృష్టి సారిస్తున్నారు. రాజధాని అభివృద్ధి పనులు, సూపర్‌ సిక్స్‌ హామీల అమలు, పెట్టుబడులు తీసుకురావడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. పార్టీ అధినేత ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారానికోసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి.. సమస్యలతో వచ్చేవారిని కలిసేవారు. ఆ తర్వాత కేవలం ఏదైనా పార్టీ కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ సైతం పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో నిమగ్నమైపోయారు. మరోవైపు.. పార్టీ సమన్వయ బాధ్యతలన్నీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక్కరే చూసుకోవలసి వస్తోంది.దీంతో రెండేళ్లకోసారి నిర్వహించుకునే సంస్థాగత ఎన్నికలనూ నిర్దేశిత సమయానికి పూర్తిచేయలేని దుస్థితి నెలకొంది. గతంలో పార్టీ కార్యాలయానికి వచ్చే నాయకులు, కార్యకర్తల సమస్యలను సావధానంగా విని.. పరిష్కరించేందుకు సీనియర్‌ నాయకులు అక్కడ అందుబాటులో ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరూ పెద్దగా రావడం లేదని అంటున్నారు. ఫలితంగా పార్టీపరంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి.

Updated Date - Aug 09 , 2025 | 05:31 AM