TDP Disciplinary Committee: ఎవరి వైఖరి వారిదే
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:59 AM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పంచాయితీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తమ తమ వాదనలను వినిపించారు.
టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని
నా నియోజకవర్గంలో ఎంపీకి పనేంటి?
వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేదంటున్నారు
తిరువూరు ఎమ్మెల్యే ఫిర్యాదు
నేను ఏనాడూ గీత దాటలేదు
చంద్రబాబే సుప్రీం.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే
విజయవాడ ఎంపీ స్పష్టీకరణ
నేడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు కమిటీ నివేదిక
సీఎం లండన్ నుంచి వచ్చాక నిర్ణయం
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పంచాయితీ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తమ తమ వాదనలను వినిపించారు. తమ వైఖరులను పునరుద్ఘాటించారు. ‘తిరువూరు నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని? ఆయన నా నియోజకవర్గంలో అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నాకు సీటు లేదని చెబుతున్నారు. ఆయన నా నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుంటే నేనూ మాట్లాడను’ అని కొలికపూడి చెప్పారు. అయితే పార్టీకి నష్టం కలిగించేలా తాను గీతదాటి వ్యవహరించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టంచేశారు. ఎమ్మెల్యే, ఎంపీ కొద్దిరోజుల కిందట పరస్పరం బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం, పార్టీ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహించడం.. ఇద్దరినీ పిలిపించి వివరణ తీసుకుని తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించడం తెలిసిందే. దీంతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇద్దరినీ పిలిపించారు. ముందుగా కొలికపూడి వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనూరాధ ఎదుట హాజ.రై వివరణ ఇచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు తన వాదనలు వినిపించారు. నివేదిక రూపంలో కమిటీకి అందజేశారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచానని తెలిపారు. వారు అడిగిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు, వివరణ ఇచ్చానన్నారు. వివాదంపై పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.
పార్టీ నిర్ణయమే శిరోధార్యం..
మరోవైపు ఎంపీ కేశినేని చిన్ని సాయంత్రం 4 గంటల ప్రాంతంలో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. సుమారు గంటపాటు తన వాదన వినిపించారు. ఏనాడూ పార్టీకి నష్టం కలిగించేలా గీత దాటి వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ‘పార్టీ కోసం 2014 నుంచీ కష్టపడుతున్నాను. పార్టీ సిద్ధాంతాలపై పూర్తి అవగాహన ఉంది. పార్లమెంటు సభ్యుడిగా నా నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంటులోని కార్యకర్తలు, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తా. అందులో భాగంగానే తిరువూరులో.. అది కూడా పార్టీ అనుమతితోనే పర్యటించాను. వ్యక్తిగత ఎజెండాలతో పార్టీని నాశనం చేయాలనుకునే వారి విషయంలో నేను కఠినంగా ఉండాల్సి వస్తోంది. నా నియోజకవర్గం పరిధిలో ఎవరితోనూ విభేదాలు లేవు. ఎవరికైనా నాతో సమస్య ఉంటే నేనే ఒక అడుగు దిగి పరిష్కరించుకుంటా. పార్టీని పణంగా పెడితే మాత్రం సహించలేను’ అని చెప్పారు. అనంతరం చిన్ని కూడా మీడియాతో మాట్లాడారు.. తాను చంద్రబాబుకు వీరభక్తుడినని.. తెలుగుదేశం పార్టీయే తనకు దైవమని అన్నారు. ‘చంద్రబాబు నాకు సుప్రీం. ఆయన తీసుకునే ఏ నిర్ణయాన్నయినా గౌరవిస్తాను. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల మనోభావాలను గౌరవించేలా పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. వీరిద్దరి వివరణలను క్రోడీకరించి.. తమ అభిప్రాయాలతో క్రమశిక్షణ కమిటీ సభ్యులు బుధవారం పల్లా శ్రీనివాసరావుకు నివేదిక సమర్పించనున్నారు. దీనిపై చంద్రబాబు లండన్ నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.