TDP Disciplinary Committee: తప్పంతా కొలికపూడిదే
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:40 AM
టీడీపీ నేతలు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మధ్య తలెత్తిన వివాదంలో తప్పంతా కొలికపూడిదేనని పార్టీ క్రమశిక్షణ కమిటీ తేల్చింది.
కఠిన చర్యలు తీసుకోవాలి.. పార్టీ లైన్ దాటి ప్రవర్తించారు
ఒక్క ఆరోపణకూ ఆధారం ఇవ్వలేదు.. సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలి
ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంపై సీఎంకు క్రమశిక్షణ కమిటీ నివేదిక
మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): టీడీపీ నేతలు.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మధ్య తలెత్తిన వివాదంలో తప్పంతా కొలికపూడిదేనని పార్టీ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ సభ్యులు వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, ఎంఏ షరీఫ్, కొనకళ్ల నారాయణ, బీసీ జనార్దన్‌రెడ్డిలు విచారణ నివేదిక ను అందించారు. కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారశైలి తొలి నుంచీ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని, తప్పటడుగు వేసిన ప్రతిసారీ క్రమశిక్షణ కమిటీ పిలిచి వివరణ తీసుకుంటూనే ఉన్నా ఆయన తన శైలిని మార్చుకోలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి 16 నెలల కాలంలో మూడుసార్లు కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారని, ప్రతిసారీ తప్పయిందని ఒప్పుకోవడం.. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పడం ఆయనకు రివాజుగా మారిందని పే ర్కొంది. ఏకంగా పార్టీ ఎంపీపైనే డబ్బు లు తీసుకుని టికెట్ ఇచ్చారని బహిరంగ ఆరోపణలు చేయడం క్షమార్హం కాదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. తాను చేసిన ఆరోపణలకు రు జువులు ఉన్నాయంటూ క్రమశిక్షణ కమిటీ ఎదుట చెప్పిన కొలికపూడి ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేద ని తెలిపారు. టీవీ చానళ్లలో వచ్చిన తన కార్యక్రమాలను పెన్ డ్రైవ్‌లో వేసి దాన్నే ఆధారంగా పరిగణించాలని కోరారని నివేదికలో పేర్కొన్నారు. కొలికపూడి తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని, కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అధిష్ఠానం వారించినా.. ‘నా నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని?.’ అని క్రమశిక్షణ కమిటీ సభ్యుల ఎదుట కొలికపూడి తన వాదన వినిపించారని, ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోకుండా చూడాల ని కూడా కోరారని నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ వాదన సరికాదన్న కమిటీ.. ఎంపీగా తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో కేశినేని పర్యటించకుండా అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపింది. అయినా తిరువూరు పర్యటన సమయంలో చిన్ని ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు సమాచారం అం దించి, ఆయన అనుమతితోనే పర్యటించారని పేర్కొంది.
అక్టోబరు 19న కొలికపూడి మాట్లాడుతూ.. ‘‘ఎంపీ చిన్ని కార్యాలయంలో కొంత మందితోపాటు తిరువూరు పరిశీలకులు కూడా డబ్బు లు తీసుకుని పదవులు ఇస్తున్నారు.’’ అని ఆరోపించారని నివేదికలో పేర్కొ న్నారు. అప్పట్టో తప్పయిందన్న కొలికిపూడి.. తన తీరును మాత్రం మార్చుకోలేదని నివేదికలో వివరించారు. కాగా, తాను ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్నిని పిలిచి మాట్లాడతానని చంద్ర బాబు కమిటీకి తెలిపారు.