TDP Defends Lokesh: సొంత ఖర్చుతోనే లోకేశ్ పర్యటనలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:41 AM
మంత్రి లోకేశ్ తన పర్యటనలకు సంబంధించిన విమాన చార్జీలకు సొంత సొమ్ము వెచ్చిస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. కొంతమంది సమాచార హక్కు కార్యకర్తలు ఇప్పటికే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కానీ అబద్ధాల....
ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోవడం లేదు
ఆయన విమాన ప్రయాణాలపై తప్పుడు ప్రచారం
జగన్ పత్రికపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్ తన పర్యటనలకు సంబంధించిన విమాన చార్జీలకు సొంత సొమ్ము వెచ్చిస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. కొంతమంది సమాచార హక్కు కార్యకర్తలు ఇప్పటికే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కానీ అబద్ధాల పునాదులపై పుట్టిన జగన్ పత్రిక మాత్రం లోకేశ్ పర్యటనలపై అసత్య కథనాలు వండి వారుస్తోందని విమర్శించారు. జగన్ మీడియా, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ 77 సార్లు హైదరాబాద్‌కు విమానంలో వెళ్లారని, ప్రభుత్వ సొమ్మును విమాన చార్జీలకు దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పత్రికలో పేర్కొన్నారని, కానీ ప్రతి పర్యటనకు ఆయన తన సొంత సొమ్ము చెల్లిస్తున్నారని తెలిపారు. చివరికి ప్రభుత్వ అధికారిక పర్యటనలు, పెట్టుబడుల సాధనకు వెళ్లిన పర్యటనలకు సైతం సొంత సొమ్మునే వెచ్చిస్తున్నారన్నారు. చినబాబు చిరుతిండి అని గతంలోనూ జగన్ పత్రిక తప్పుడు వార్తలు రాస్తే లోకేశ్ పరువు నష్టం కేసు వేశారని, అయినా వారి దొంగ బుద్ధి మారలేదని విమర్శించారు. జగన్ మాదిరిగా ఇంట్లో ఎలుకలు పట్టడానికి ప్రభుత్వ సొమ్ము దోచేయలేదని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి 15 కిమీ దూరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనలా ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక విమానంలో వెళ్లలేదని అన్నారు. ఎంత తీరికలేని కార్యక్రమాలున్నా ఏడాదిన్నరలో లోకేశ్ 75 ప్రజాదర్బార్లు నిర్వహించి వేల మంది సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారని తెలిపారు. వారానికోసారి హైదరాబాద్ వెళ్తున్నారని అక్కసు వెళ్లగక్కిన జగన్ పత్రికకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా ఆయనకుందన తెలియదా అని ప్రశ్నించారు. గత ఏడాది ఆగస్టు 31న బుడమేరు వరద విజయవాడను ముంచెత్తిన సమయంలో లోకేశ్ హైదరాబాద్, ఢిల్లీలో సేదతీరారని జగన్ పత్రికలో రాశారని, కానీ ఆయన బుడమేరు కట్ట గండిపూడ్చే పనిని జలవనరుల మంత్రి రామానాయుడితో కలిసి పర్యవేక్షించిన సంగతి మరచిపోయారని మండిపడ్డారు.