CM Chandrababu: రైతు సంక్షేమమే టీడీపీ ఎజెండా
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:19 AM
రైతు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ. మన జెండాలోనే నాగలి గుర్తు ఉంది. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.
అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం: సీఎం
ప్రతి రైతు కళ్లలో ఆనందమే లక్ష్యం
ఇదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం
నేడు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ
తొలి విడతగా రూ.7 వేలు ఇస్తున్నాం
ఇందులో కేంద్రం వాటా రూ.2 వేలు
46.85 లక్షల మంది రైతులకు లబ్ధి
వైసీపీ 7,500 ఇస్తే మనం 20 వేలిస్తున్నాం
చేస్తున్న మంచిని జనంలోకి తీసుకెళ్లండి
టెలికాన్ఫరెన్స్‌లో శ్రేణులకు బాబు పిలుపు
ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలో ఉన్నామనే విషయాన్ని ఎప్పటికీ మరవొద్దు. గత ఎన్నికల్లో మనకు ఓటేసినవారు ఎప్పుడూ మనతోనే ఉండాలి.మనం ఇంత సంక్షేమం చేస్తున్నా.. రాష్ట్రంపై ఇంకా కొందరు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ల నైజాన్ని ప్రజల్లో ఎండగట్టాలి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘రైతు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ. మన జెండాలోనే నాగలి గుర్తు ఉంది. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇదే మన పార్టీ సిద్ధాంతం. ప్రతి రైతులో మన ప్రభుత్వం ఉందనే భరోసాను కలిగించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఉండవల్లి నివాసం నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించారు. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొటొక్కటిగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వాని కంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నామని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ‘సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. ఈ నెలలోనే సూపర్ సిక్స్‌లోని రెండు హామీలు నెరవేరుస్తున్నాం. అన్నదాత సుఖీభవ నిధులను శనివారం విడుదల చేస్తున్నాం.
తొలి విడతగా రూ.7 వేలు జమ చేస్తున్నాం. ఇందులో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్రం వాటా రూ.5 వేలు ఉంటుంది. 46,85,838 మంది మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. రూ.2,342.92 కోట్లు విడుదల చేస్తు న్నాం. కేంద్రం రూ.831.51 కోట్లు ఇస్తోంది. అర్హులైన రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే 155251 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు’ అని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..
నిత్యం జనంలో ఉండాలి..
కష్టాలున్నా సంక్షేమం అమలు చేస్తున్నాం. మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జనంలోకి తీసుకెళ్లి అర్ధమయ్యేలా వివరించాల్సింది పార్టీ యంత్రాంగమే. నిత్యం వారిలో ఉండాలి.. వారి కోసమే పనిచేయాలి. మరింత మంది మన పాలనను మెచ్చాలి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కోటి కుటుంబాలను మన పార్టీ నాయకులు కలవడం ఓ రికార్డు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఏమైనా లోపాలుంటే సరిచేసుకోవాలని సూచిస్తున్నాం.
రైతుల కోసమే టీడీపీ..
తెలుగుదేశం తొలి నుంచీ రైతుల పక్షపాతి. ఎన్టీఆర్ రైతులకు రూ.50కే విద్యుత్తుసరఫరా చేశారు. రాయలసీమలో 90 శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే చేపట్టాం. మనం చేపట్టిన ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. పథకాలను రద్దు చేసింది. ఆ ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇచ్చింది. మనం రూ.20 వేలు ఇస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్లు బకాయిపెడితే మనం వచ్చాక చెల్లించాం. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తున్నాం. అగ్రిటెక్ ద్వారా రైతులకు పరికరాలు అందజేస్తున్నాం. ప్రతి రైతు కళ్లలో ఆనందం చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.