Share News

Minister Narayana: జూన్‌నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:38 AM

వచ్చే సంవత్సరం జూన్‌ చివరినాటికి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2,61,640 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి, మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి...

Minister Narayana: జూన్‌నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి

  • పూర్తయినవి ప్రతివారమూ అప్పగింత

  • పెండింగ్‌ పనులకు 7,280కోట్లు కావాలి

  • అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): వచ్చే సంవత్సరం జూన్‌ చివరినాటికి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2,61,640 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి, మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ప్రతి శనివారం పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. టిడ్కో ఇళ్లపై సోమవారం శాసనసభలో చేపట్టిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘2014-19 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడులక్షల మంది పట్టణ ప్రజలకు ఇళ్లు అవసరం అని అంచనా వేశాం. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని 2.61 లక్షలకు కుదించింది. 4.39లక్షల ఇళ్లను ఏకపక్షంగా రద్దుచేసింది. మేం నాడు 2019 మే నాటికి 71వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేశాం. ఆ తర్వాత 1.75లక్షల ఇళ్లను, మౌలిక సదుపాయాల పనులను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3100 కోట్లు, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు రూ.3200 కోట్ల మేర నిధులు అవసరం. ఇతర మౌలిక సదుపాయాల పనులను కూడా కలుపుకొంటే మొత్తం రూ.7,280 కోట్లు అవసరం. ఈ నిధులను వేర్వేరు మార్గాల్లో సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లు కడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ రంగులు వేయాలనే సూచనను చంద్రబాబు తిరస్కరించారు. కానీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం... ఆ పార్టీ రంగులు వేసుకుంది. ఉత్తర్వులు లేకుండా వేసిన ఆ రంగులకు నిధులు ఇవ్వలేమని సాంకేతిక కమిటీ స్పష్టంచేసింది’ అని చెప్పారు.దీనిపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వేయమంటేనే రంగులు వేశారన్నారు.


త్వరలో లబ్ధిదారులకు అప్పగించాలి

టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అప్పగించాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లను వైసీపీ రద్దు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కావాలనే కొందరికి ఇళ్లు రద్దు చేశారని జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆరోపించారు. లబ్ధిదారుల పేరుతో జగన్‌ రుణాలు తీసుకున్నదని వాస్తవం చెప్పినందుకు తనను వైసీపీ సైకో బ్యాచ్‌ వాట్సాప్‌, ఇతర మార్గాల్లో పచ్చి బూతులు తిడుతున్నదని బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Updated Date - Sep 23 , 2025 | 05:39 AM