Tata Consultancy Services: టీసీఎస్ వచ్చేస్తోంది!
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:40 AM
విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తర్వాత మరో ఐటీ దిగ్గజ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత జనవరి నెలాఖరులోగా కార్యాలయం ప్రారంభించడానికి టాటా....
జనవరి నెలాఖరులోగా విశాఖలో ప్రారంభం
తొలుత రెండువేల మంది ఉద్యోగులతో ఆపరేషన్స్
మిలీనియం టవర్లలో ఇంటీరియర్ పనులు పూర్తి
ఒకేరోజు తాత్కాలిక కార్యాలయం ప్రారంభం.. శాశ్వత క్యాంప్‌స భూమి పూజకు సన్నాహాలు
2027 చివరికి శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి
విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తర్వాత మరో ఐటీ దిగ్గజ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత జనవరి నెలాఖరులోగా కార్యాలయం ప్రారంభించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సిద్ధమవుతోంది. కాగ్నిజెంట్ కంటే ముందే ఈ సంస్థకు భవనం, భూమి కేటాయించినా అనివార్య కారణాలతో ఆపరేషన్లు ఆలస్యమయ్యాయి. టీసీఎ్‌సకు శాశ్వత క్యాంపస్ కోసం రుషికొండ ఐటీ పార్కులోని హిల్-3పై రాష్ట్ర ప్రభుత్వం 21.6 ఎకరాలను కేటాయించింది. ఒక ఎకరం 99 పైసల చొప్పున ఇచ్చింది. ఆ ఆఫర్ చూసి కాగ్నిజెంట్ ముందుకొచ్చింది. వెనుక వచ్చినా ముందే కార్యకలాపాలు మొదలుపెట్టింది. టీసీఎస్ తన శాశ్వత క్యాంపస్‌ను 2027 చివరికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో రూ.1,370 కోట్ల పెట్టుబడి పెట్టి 12వేల మందికి ఉద్యోగాల కల్పనకు ఎంవోయూ కుదుర్చుకుంది. అప్పటివరకూ తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించడానికి హిల్-3లోని మిలీనియం టవర్-1లో 4అంతస్థులు, టవర్-2లో 1 అంతస్థు మినహా మిగిలిన మొత్తం టీసీఎ్‌సకే ఇచ్చారు. టవర్-1లోని 4అంతస్థుల్లో కాండ్యుయెంట్ కంపెనీ నడుస్తోంది. ఇది కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేతుల మీదుగా 2019లో ప్రారంభమైంది. టీసీఎస్‌కు కేటాయించిన టవర్లలో ఇంటీరియర్ పనులన్నీ పూర్తయ్యాయి.