Visakhapatnam: ఇదిగో టీసీఎస్
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:55 AM
విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్లే దిగ్గజ కంపెనీ టీసీఎస్ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రుషికొండ ఐటీ పార్కు హిల్..
వైజాగ్ మిలీనియం టవర్స్‌పై బోర్డు ఏర్పాటు
పూర్తి కావొచ్చిన ఇంటీరియర్ పనులు
త్వరలోనే కార్యకలాపాలు
విశాఖలో టీసీఎస్ బిల్డింగ్ సిద్ధం
విశాఖపట్నం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరో మెట్టుపైకి తీసుకువెళ్లే దిగ్గజ కంపెనీ టీసీఎస్ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రుషికొండ ఐటీ పార్కు హిల్ నంబరు-3పై మిలీనియం టవర్స్‌ను టీసీఎస్‌కు ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. బిల్డింగ్‌లో అవసరమైన ఇంటీరియర్ పనులన్నీ టీసీఎస్ చేయిస్తోంది. ఇవి పూర్తికావచ్చాయి. భవనంపై టీసీఎస్ పేరుతో బోర్డును ఏర్పాటు చేసింది. త్వరలో 2 వేల మంది ఉద్యోగులతో ఈ క్యాంపస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో పనిచేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఉద్యోగులను తొలుత విశాఖపట్నం తీసుకువచ్చి, ఆ తరువాత కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటారని సమాచారం. కాగా, టీసీఎస్ సొంత క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడానికి రుషికొండ ఐటీ పార్కులోని హిల్ నంబరు-3 పైనే 21.6 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చారు. సుమారు రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వం భూమి ఇచ్చింది.