Share News

Tax Officer Subhash: నా అకౌంట్‌ నా ఇష్టం

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:32 AM

రాజధాని అమరావతిపై ఫేస్‌బుక్‌లో విషం చిమ్మిన వాణిజ్య పన్నుల అధికారి ఎస్‌.సుభాష్‌ తన పోస్టులను సమర్థించుకున్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు.

Tax Officer Subhash: నా అకౌంట్‌ నా ఇష్టం

  • ఫేస్‌బుక్‌లో నేను రాసుకునేవాటికి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి?

  • అమరావతిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ప్రభుత్వ అధికారి సుభాష్‌

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై ఫేస్‌బుక్‌లో విషం చిమ్మిన వాణిజ్య పన్నుల అధికారి ఎస్‌.సుభాష్‌ తన పోస్టులను సమర్థించుకున్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టులు పెట్టారు. ‘‘ఒకే ఒక్క వర్షం. అమరావతి జలమయం. ఇదే మన డ్రోన్‌ క్యాపిటల్‌. ఇదే మన క్వాంటమ్‌ వ్యాలీ’’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు జోడించారు. మరో పోస్టులో ‘అమరావతినే రిజర్వాయర్‌గా కడితే సరి’ అని వ్యాఖ్యానించారు. అమరావతిపై పనిగట్టుకుని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్నవారిని ఉద్దేశించి ‘శాడిస్టు సైకోలు’ అనే పేరిట ఈ నెల 19న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. అందులో ప్రభుత్వ ఉద్యోగి అయిన సిద్ధార్థి సుభాష్‌ పోస్టుల గురించి కూడా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయనకు వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల మెమో జారీచేసింది. దీంతో ఆ శాఖ చీఫ్‌ కమిషనర్‌కు సుభాష్‌ వివరణ ఇచ్చారు. ‘‘నా ఫేస్‌బుక్‌ ఖాతా నా వ్యక్తిగతం. నేను ప్రభుత్వ ఉద్యోగినని ఆ ఖాతాలో ఎక్కడా పేర్కొనలేదు. ఆ ఖాతా నాదికాదని చెప్పొచ్చు. కానీ.. అలా చెప్పను’’ అని తెలిపారు. ‘‘నేను ఒక్క వ్యాఖ్యను కూడా ప్రభుత్వంపై చేయలేదు. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టలేదు. పొరుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్‌, చెన్నై నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి. అలాగే ఏపీ రాజధాని అమరావతి కూడా ముంపునకు గురైందన్నాను’’ అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను, పోస్టులను పరిశీలిస్తే... వాస్తవాలను వక్రీకరించారని స్పష్టమవుతుంది.


అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం, అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం ప్రభుత్వ విధాన నిర్ణయం. దీనిని సుభాష్‌ తప్పుపట్టినట్లు ఆయన జోడించిన వ్యంగ్య వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయినా సరే... ‘నేను తప్పు చేయలేదు’ అని దబాయించడం గమనార్హం. పైగా... ‘వ్యక్తిగతంగా రాసుకునే ఫేస్‌బుక్‌లోని వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించడం ఏమిటి?’ అంటూ సుభాష్‌ వింత వాదన లేవనెత్తారు. ‘‘ప్రధాని మోదీ సైతం తన ప్రభుత్వంపై విమర్శలను స్వాగతిస్తున్నారు. విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొంది’’ అని వివరించారు. నిర్మాణాత్మక విమర్శలకు, కువిమర్శలకు తేడా ఉంటుందని సుభాష్‌ విస్మరించడం గమనార్హం.

Updated Date - Sep 03 , 2025 | 04:34 AM