Paderu: అరకు కాఫీ బ్రాండింగ్‌కు టాటా సంస్థ
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:19 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో 21 సంస్థలు శనివారం పాడేరులో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆదివాసీల జీవనోపాధి, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్...
కాఫీ ప్లాంటేషన్ కోసం ఐటీసీ
21 సంస్థలతో కుదిరిన ఎంవోయూలు
పాడేరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో 21 సంస్థలు శనివారం పాడేరులో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆదివాసీల జీవనోపాధి, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, పర్యాటక కేంద్రంగా ఏజెన్సీ అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో రబ్బర్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రీయ రబ్బర్ బోర్డు, జీసీసీ ఉత్పత్తులను అమెరికా వంటి దేశాల్లో విక్రయించేందుకు హాతీ సర్వీసెస్ ఒప్పందం చేసుకున్నాయి. అరకు ఆర్గానిక్ కాఫీని బ్రాండింగ్ చేసేందుకు దిగ్గజం సంస్థ టాటా సంస్థ ముందుకువచ్చింది. చింతపల్లి వద్ద కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సబ్ కో సంస్థ సిద్ధమైంది. అదనంగా 1,600 హెక్టార్ల కాఫీ ప్లాంటేషన్ కోసం ఐటీసీ సంస్థ పాడేరు ఐటీడీఏతో ఒప్పందం చేసుకుంది. గిరిజన ప్రాంతంలోని మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ చేసేలా ఈజీ మార్ట్, పసుపు వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్ చేసేందుకు ఎక్విప్ సంస్థ ఐటీడీఏతో ఒప్పందం చేసుకున్నాయి. గిరిజన ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం హోమ్‌స్టేలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఓయో హోమ్స్, హోమీ హాట్స్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. గిరిజన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేలా మార్పు సొసైటీ ఒప్పందం చేసుకుంది. గిరిజన పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పర్యాటకశాఖ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్, కమిషనర్ సదా భార్గవి, కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, జీసీసీ ఎండీ కల్పనాకుమారి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు, వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.